రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.! దేనికోసం.?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ ఈ యాత్ర సాగుతుంది. సుమారు 3 వేల కిలోమీటర్ల మేర యాత్రకు కాంగ్రెస్ పార్టీ స్కెచ్ వేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యాత్ర జరుగుతుంది.

అధికారికంగా నేడు యాత్రను రాహుల్ గాంధీ కన్యాకుమారిలో ప్రారంభించినప్పటికీ, పాదయాత్ర మాత్రం గురువారం నుంచి ప్రారంభమవుతుందట. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో 2014లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ ఉద్యమమే లేవదీసింది.

అప్పటికే కాంగ్రెస్ పాలన పట్ల విసిగిపోయిన దేశ ప్రజానీకం, బీజేపీని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భావించారు. ఆ తర్వాత బీజేపీ వ్యూహం దెబ్బకి కాంగ్రెస్ మరింత కకావికలమైపోయింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందించే లక్ష్యంతో రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో యాత్రను చేపట్టారు. ఉద్దేశ్యం బాగానే వున్నా, ఈ యాత్ర ఎంత మేర సత్ఫలితాలనిస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

ఎందుకంటే, అసలంటూ ఈ భారత్ జోడో యాత్ర లక్ష్యం ఏమిటి.? అన్నదానిపై కాంగ్రెస్ పార్టీలోనే స్పష్టత లేదు. రాహుల్ గాంధీని భావి ప్రధానిగా కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ నాయకులు చెబుతుంటారు. కానీ, కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికే రాహుల్ గాంధీ ఇష్టపడటంలేదాయె. అలాంటి రాహుల్, ప్రధాని పీఠమెలా ఎక్కుతారు.?

వాస్తవానికి రాహుల్ గాంధీ గతంలోనే ప్రధాన మంత్రి అయి వుండాలి. అప్పట్లోనూ ఆయన ఆ పీఠంపై ఆసక్తి చూపకపోవడంతో, మన్మోహన్ సింగ్‌ని ప్రధాని పదవిలో కొనసాగించాల్సి వచ్చింది. రాహుల్ ఓ సారి కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత వదిలేసుకున్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్నా, కాంగ్రెస్ పార్టీకి సోనియా ఇంకా అధ్యక్షురాలిగా కొనసాగాల్సి వస్తోంది.. అదీ బలవంతంగా.. అయిష్టంగా. పార్టీలోనే ఇంతటి చిత్ర విచిత్రమైన పరిస్థితి వున్నప్పుడు, జోడో యాత్ర వల్ల ప్రయోజనమేంటి.? నాయకులు ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ పార్టీకి దూరమైన దరిమిలా, భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి ఎంతమేరకు ఉపయోగపడుతుంది.?