తానిచ్చిన సలహాని ఎవరూ పాటించరనీ, ఎవరూ లెక్క చేయరనీ తెలిసీ.. సలహా ఇచ్చే క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించేస్తుంటారు కొందరు. అందుకే, దాన్ని ఉచిత సలహా అంటారు. వైసీపీ రెబల్ ఎంపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా వైసీపీ బాగు కోసం, వైసీపీ ప్రభుత్వ బాగు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ ఉచిత సలహా పారేశారు. ఉత్తరాంధ్రలో పార్టీ ప్రతిష్ట మసకబారుతోందనీ, అందుకు విజయసాయిరెడ్డి కారణమనీ రఘురామ తాను రాసిన ఉచిత సలహా లేఖలో పేర్కొన్నారు. వెంటనే విజయసాయిరెడ్డిని అదుపులో పెట్టాలన్నది రఘురామ ఉవాచ.
విజయసాయిరెడ్డికే కాదు, వైసీపీలో ఎవర్ని ఎక్కడ వుంచాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగా తెలుసన్నది వైసీపీ వర్గాల ఉవాచ. సరే, ఓ వైపు ప్రభుత్వం.. ఇంకో వైపు పార్టీ.. రెండిటినీ చూసుకోవడంలో వచ్చే ఇబ్బందులవల్ల పార్టీపై ఫోకస్ పెట్టడం తగ్గించాల్సి వస్తుంది అధికారంలో వున్నవారికి. ఆ సమయంలో కొందరు నేతలు హద్దూ అదుపూ లేకుండా చెలరేగిపోతుంటారు.. వారు చేసే చర్యల వల్ల పార్టీ నష్టపోతుంది కూడా. అది చంద్రబాబు హయాంలో స్పష్టంగా కనిపించింది.
వైఎస్ జగన్ హయాంలోనూ అదే జరుగుతోందా.? అంటే, ఔననీ అనలేం.. కాదనీ అనలేం. ఇప్పుడంతా బాగానే వుంది గనుక.. బాగానే కనిపిస్తుంది. ఏదన్నా తేడా వస్తే.. అసలు డ్యామేజ్ గురించి తెలుస్తుంది. ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి పెత్తనాన్ని చాలామంది వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నా, ముఖ్యమంత్రి జగన్ వద్ద విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేంత సీన్ ఎవరికీ లేదంటారు కొందరు. ఆ విషయాన్నే రఘురామ ప్రస్తావించారనుకోవాలేమో. అయితే, ముఖ్యమంత్రికీ విజయసాయికీ గ్యాప్ పెంచేందుకు రఘురామ పన్నిన కుట్ర.. అనే వాదననీ కొట్టిపారేయలేం.