వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు అంత ఈజీ కాదన్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన చాలామంది ఎమ్మెల్యేలున్నారు. వారెవరిపైనా వేటు పడలేదు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎందుకు తటపటాయిస్తున్నారు.? అన్నది అధికార వైసీపీకి తెలియని విషయం కాదు.
మరెలా, రఘురామపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నట్టు.? రఘురామ వైసీపీని కాదనుకుంటున్న మాట వాస్తవం. అలాగని, ఆయన ఏ ఇతర పార్టీలోనూ చేరడంలేదు. సో, రఘురామపై అనర్హత అంత తేలిక కాదు. రఘురామ అనర్హత వ్యవహారంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనర్హత పిటిషన్ అందిందనీ, దానిపై విచారణ జరుగుతోందనీ చెప్పుకొచ్చారు.
రన్నింగ్ కామెంటరీ చేయలేనని కూడా ఆయన చెప్పడం గమనార్హం. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే నిర్ణయం వుంటుందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పడమంటే, ఇప్పట్లో ఈ అంశం తేలేలా లేదన్నమాట. మరి, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న దరిమిలా, ఈ అంశంపై వైసీపీ పోరాటం ఎలా వుండబోతోంది.? పార్లమెంటుని స్తంభింపజేయడానికీ వెనుకాడబోం.. అని వైసీపీ ఇప్పటికే చెప్పుకొచ్చింది.
అయితే, వైసీపీకి పార్లమెంటులో వున్న బలం ఎంత.? అన్నదీ ఇక్కడ తేలాల్సిన విషయమే. మొత్తం 21 మంది లోక్ సభ సభ్యులు మాత్రమే వున్నారు వైసీపీకి, రఘురామని మినహాయిస్తే. అయినా, రాష్ట్రానికి సంబంధించి చాలా కీలకమైన అంశాలపై పార్లమెంటుని స్తంభింపజేస్తే బావుంటుందేమోగానీ, రఘురామపై రచ్చ చేస్తే ఏం ప్రయోజనం.?