వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు శుభవార్త అందింది. దేశంలోని ఎంపీల పనితీరు ఆధారంగా ర్యాంకులు విడుదలయ్యాయి. మొత్తంగా రఘురామరాజుకు 40వ ర్యాంకు వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల సంగతికి వస్తే ఆయనే టాప్. పార్లమెంటులో ఏపీ తరపున గట్టిగా వాయిస్ వినిపిస్తున్నామని, హక్కుల కోసం పోరాడుతున్నామని అంటున్న ఎంపీలు ఎవ్వరికీ రఘురామరాజు స్థాయి ర్యాంక్ దొరకలేదు. అందరూ ఆయన వెనకే ఉన్నారు. అంటే 40వ ర్యాంక్ కంటే తక్కువే. మిథున్ రెడ్డి, నందిగం సురేష్, బాలశౌరి లాంటి ఎంపీలంతా రఘురామరాజు కంటే వెనకే ఉండిపోయారు. ఎంపీల పనితీరు ఆధారంగా పార్లమెంటరీ బిజినెస్ కమిటీ ర్యాంకులు కేటాయించింది.
దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 539 ఎంపీల ర్యాంకులను ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు అందరిలోనూ రఘురామ మొదటి ర్యాంకు సాధించారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీల్లో 40వ ర్యాంకు పొందారు. తనకు 40వ ర్యాంక్ వచ్చిందనే సంతోషం కన్నా ఇతర వైసీపీ ఎంపీల కంటే, జగన్ సన్నిహితులుగా పేరొందిన వారి కంటే ప్రథమ స్థానంలో ఉండటమే ఆయనకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. ఆ ఆనందాన్ని బహిరంగంగానే పంచుకున్నారు ఆయన. ఈ పరిణామం వైసీపీ నేతలు కొందరికి కడుపు మండేలా చేసింది. ఒక్కరంటే ఒక్కరు కూడ రఘురారాజుకు శుభాకాంక్షలు చెప్పడం లాంటివి చేయలేదు. కనీసం వారి అనుకూల మీడియాలో కూడ ఈ వార్త పెద్దగా హైలెట్ కాలేదు.
విబేధాల కారణంగా లోక్ సభలో మాట్లాడొద్దంటూ పార్టీ నుండి ఆంక్షలు రావడం, కరోనా కారణంగా ప్రస్నోత్తరాల పర్వం లేకుండానే పార్లమెంటరీ వ్యవహారాలు పూర్తయ్యాయి. ఇన్ని అడ్డంకుల నడుమ కూడ ఆయన సొంతగా కలుగజేసుకుని లోక్ సభలో మాట్లాడటంతో ఆయనకు ఉత్తమమైన ర్యాంక్ వచ్చింది. ఇక సభలో రఘురామరాజు స్థానాన్ని కూడా మార్చారు. స్పీకర్ ఓం బిర్లాకు పిర్యాదు చేసి మరీ రఘురామరాజును ముందు వరుసల నుండి వెనుక వరుసలు మార్చారు. అసలు ఆయన మీద అనర్హత వేటు వేయిద్దామనేది వైసీపీ అధిష్టానం కోరిక. తమకు, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న రఘురామరాజు మీద పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి మరీ స్పీకర్ వద్ద డిమాండ్ వినిపించారు. కానీ ఇంతవరకు ఎలాంటి యాక్షన్ లేదు. మరోవైపు రఘురామరాజు క్రిటిసిజమ్ ఆగలేదు. ఇలాంటి తరుణంలోనే ఆయనకు అందరు ఎంపీలకు మించి మంచి ర్యాంక్ రావడంతో అధికార పక్షం కాస్త డిస్టర్బ్ అయింది.