వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ పోరు ఇప్పుడు న్యాయస్థానం వద్దకు చేరింది. వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఈ అంశానికి సంబంధించి కాస్త లేటుగా అయినా ఘాటుగానే కౌంటర్ దాఖలు చేశారు వైఎస్ జగన్. దానిపై రిజాయిండర్ వేసిన రఘురామ, అందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు.
బెయిల్ షరతుల్ని వైఎస్ జగన్ అతిక్రమించారనీ, బెదిరింపులకు పాల్పడుతున్నారనీ, ఈ క్రమంలో తాను బాధితుడిగా మారానని చెప్పుకున్నారు. కాగా, కౌంటర్ దాఖలు చేసే సమయంలో రఘురామకు అర్హత లేదని వైఎస్ జగన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
అయితే, బాధితుడ్ని గనుక తనకు బెయిల్ రద్దు పిటిషన్ వేసే హక్కు వుందని రఘురామ పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు, పార్టీని ప్రశ్నిస్తున్నందుకు తనపై రాజకీయ వేధింపులు జరుగుతున్నాయన్నది రఘురామ వాదన. రాజద్రోహం కేసులో అరెస్టు చేయడం, సీఐడీ కస్టడీలో థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టడం.. వంటి అంశాల్ని రఘురామ రిజాయిండర్ ద్వారా ప్రస్తావించారట. దీనిపై వైఎస్ జగన్ తరఫు వాదనల కోసం కొంత సమయాన్ని కోరారు న్యాయవాదులు.
దాంతో, కేసు తదుపరి విచారణ జులై 1వ తేదీకి వాయిదా పడింది. ఇరు పక్షాల వాదనలూ టిట్ ఫర్ టాట్.. అన్నట్లే కనిపిస్తుండడంతో ఈ కేసు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి, ఆ పార్టీ మీద వ్యూహాత్మకంగా రఘురామ రాజకీయ దాడి చేస్తున్నారన్నది నిర్వివాదాంశం. అదే సమయంలో, రఘురామని అనవసరంగా కెలికామన్న భావన వైసీపీకి చెందిన కొంరదు నేతల్లో వ్యక్తమవుతోందట.