వైఎస్సార్సీనీ అధ్యక్ష పదవికి రఘురామ పోటీ.?

నర్సాపురం నియోజకవర్గం నుంచి మళ్ళీ పోటీ చేస్తే డిపాజిట్లు వస్తాయో రావోనన్న డౌట్‌తోనే కనీసం ఆ నియోజకవర్గం వైపు కూడా కన్నెత్తి చూడటంలేదు సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణరాజు. పిలిచి టిక్కెట్ ఇచ్చి, గెలిపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద నిత్యం బురద చల్లుతోన్న రఘురామ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.. పార్టీ అధినేత పదవి మీద.

తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల తరహాలో పారదర్శకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికలు జరిగితే, అధ్యక్ష పదవికి తాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పోటీ పడతాననీ, తన తరఫున 125 మందితో నామినేషన్ వేయిస్తాననీ రఘురామ సంచలన ప్రకటన చేశారు.

‘నేను వైసీపీలోనే వుండాలనుకుంటున్నాను. అందుకే, వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్నాను. నన్ను పార్టీలోంచి పంపాలనుకుంటే నిర్భయంగా పంపేయొచ్చు. కానీ, ఆ ధైర్యం వారికి లేదు. పార్టీ పట్ల నా నిబద్ధత ఏంటో చాలామందికి తెలుసు. అందుకే, నన్ను పార్టీ నుంచి బయటకు పంపడంలేదు..’ అంటూ రఘురామ వింత వాదనను తెరపైకి తెచ్చారు.

పార్టీ నుంచి రఘురామను బయటకు పంపితే, ఆయనపై అనర్హత వేటు పడటం కొంత కష్టం కావొచ్చు. అందుకే, వైసీపీ కాస్త ఉపేక్షిస్తోంది రఘురామపై పార్టీ పరంగా బహిష్కరణ వేటు వేసే విషయమై. ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాల నేపథ్యంలో అనర్హత వేటు నుంచి రఘురామ తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వున్నాయి.

ఇక, రఘురామ అను నిత్యం రచ్చబండ పేరుతో రొచ్చు రొచ్చు చేస్తూనే వున్నారు.. చిత్ర విచిత్రమైన వాదనలతో. అంతలా వైసీపీ ప్రభుత్వం ఆయనకు ఇష్టం లేకపోతే, వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు కదా.? అలాక్కూడా చేయరాయన. నర్సాపురం మొహం చూడటంలేదు గనుక, ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా.? అంటే అదీ లేదు.

ఇంకో రెండున్నరేళ్ళదాకా.. లేదంటే, అనర్హత వేటు పడేదాకా.. రఘురామ నుంచి ఈ రచ్చబండ రొచ్చు రాజకీయం కొనసాగుతూనే వుంటుంది.