వైసీపీ రెబల్ ఎంపీ కొత్త టార్గెట్ విజయసాయిరెడ్డి.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, తన తదుపరి టార్గెట్ విజయసాయిరెడ్డి.. అంటున్నారు. విజయసాయిరెడ్డి విదేశాలకు పారిపోవాలనుకుంటున్నారనీ, ఆయన బెయిల్ రద్దు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చెప్పారు రఘురామ. తనకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం వుందనీ, గతంలో జగన్ బెయిల్ రద్దు కోసం తీవ్రంగా ప్రయత్నించిన సీబీఐ, ఇప్పుడెందుకో అంత ఆసక్తి చూపడంలేదనీ, అయినా గతంలో సీబీఐ చేసిన వాదనలు ఇంకా అలాగే అందుబాటులో వున్నందున, న్యాయస్థానం ఇచ్చే తీర్పు సానుకూలంగా వుంటుందని భావిస్తున్నట్లు రఘురామ చెప్పుకొచ్చారు. ఆగస్ట్ 25న న్యాయస్థానం జగన్ బెయిల్ రద్దు విషయమై రఘురామ దాఖలు చేసిన పిటిషన్ మీద తీర్పు వెల్లడించనున్న విషయం విదితమే.

ఇదిలా వుంటే, రఘురామపై అనర్హత వేటు దిశగా అత్యంత చాకచక్యంగా పావులు కదుపుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే, ఢిల్లీ స్థాయిలో తనకున్న ‘పెద్ద’ పరిచయాలతో, అనర్హత వేటుని రఘురామ తప్పించుకుంటున్నారనే వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కాగా, రఘురామ దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కేంద్రానికి ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. దానికి కౌంటర్‌గానే రఘురామ, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తున్నాన్నమాట. అయినా, వైసీపీ నుంచి గెలిచి, వైసీపీ మీద పోరాటం చేస్తున్న రఘురామ, ఇంకా ఆ పార్టీని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నట్టు.? వైసీపీ ఎందుకు ఆయనపై సస్పెన్షన్ వేటు వేయకుండా నాన్చుతున్నట్టు.?