25 వేల కోట్ల రూపాయల అప్పులకు సంబంధించి కాగ్ ద్వారా ఆడిట్ చేయించాలంటూ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రాలు అప్పులు చేయక తప్పడంలేదు. కేంద్రం కూడా అప్పులు చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. విభజనతో గాయపడ్డ ఆంధ్రప్రదేశ్.. ఆ గాయాల నుంచి కోలుకోకుండానే దెబ్బ మీద దెబ్బ తగులుతోన్న దరిమిలా, అప్పులు ఇంకాస్త ఎక్కువగానే వుంటాయి.
ఆ విషయం.. అనేకానేక ఆర్థిక కార్యకలాపాల్ని వ్యాపారవేత్తగా నిర్వహించిన రఘురామకి తెలియకుండా వుంటుందా.? సరే, వైసీపీకి దూరంగా వున్నారు గనుక, వైఎస్ జగన్ ప్రభుత్వం మీద కక్ష కట్టారు గనుక, రఘురామ ఆరోపణలు చేయడంలో వింతేమీ లేదు.
కానీ, ఆ ఆరోపణల్ని వైసీపీ లైట్ తీసుకుని పెద్ద తప్పే చేస్తోంది. రఘురామకి సరైన సమాధానం వైసీపీ ఇవ్వకపోతే, ఆయన చేసిన, చేస్తున్న ఆరోపణలే నిజమన్న భావన ప్రజల్లోకి వెళుతుంది. ఇదిలా వుంటే, రఘురామ మీద అనర్హత వేటు వేయాలంటూ పార్లమెంటు సాక్షిగా వైసీపీ ఎంపీలు పోరాడుతున్నారు. ప్లకార్డులు చూపిస్తున్నారు.. నినదిస్తున్నారు.. సభను స్తంభింపజేస్తున్నారు.
కానీ, వైసీపీ వాదన నెగ్గడంలేదు. కాగా, రఘురామ మీద అనర్హత వేటు కోసం డిమాండ్ చేస్తున్న వైసీపీ, టీడీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న డిమాండ్ తెరపైకొస్తోంది. ఆ విషయమై వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంటే మంచిదేమో.
రాష్ట్ర స్థాయిలో అనర్హత వేటు వేయడానికి అవకాశం వున్నా, టీడీపీ నుంచి దూకిన ఎమ్మెల్యేలను కాపాడుతున్న వైసీపీ, ఢిల్లీ వేదికగా రఘురామపై అనర్హత వేటు వేయాలని పోరాడటంలో అర్థం లేదనే భావన ప్రజల్లో కనిపిస్తోంది. మొత్తమ్మీద, రఘురామ వ్యవహారం వైసీపీకి పెద్ద తలనొప్పిగానే మారిపోయిందనన్నమాట. ఈ తలనొప్పి ఎప్పటికి తగ్గేనో ఏమో.