Raghurama : చింతామణిపై రఘురామ ‘పిల్’: గెలిస్తే సీన్ మారిపోద్ది.!

Raghurama : యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు మరో మారు వైఎస్ జగన్ సర్కారుకి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. చింతామణి నాటకాన్ని ఇటీవల వైఎస్ జగన్ సర్కారు నిషేధించగా, ఆ నిషేధాన్ని సవాల్ చేస్తూ పిల్ దాఖలు చేశారు రఘురామ.

అసలు చింతామణి నాటకమేంటి.? దాని చుట్టూ కమ్ముకున్న వివాదమేంటి.? కాస్త లోతుగా ఆలోచిస్తే, అసలు చింతామణి నాటకం వేరు.. ఇప్పుడు వివాదాలు ఎదుర్కొంటున్న నాటకం వేరు. చింతామణి నాటకంపై వాస్తవానికి వివాదం లేదు. అందులోని సుబ్బి శెట్టి పాత్ర చుట్టూనే వివాదం.

సుబ్బి శెట్టి పాత్ర ద్వారా తమ సామాజిక వర్గాన్ని కించపర్చుతున్నారనీ, జుగుప్సాకరమైన రీతిలో ఆ పాత్రని చిత్రీకరించారనీ వైశ్య సామాజిక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది చాలాకాలంగా. రోశయ్య హయాంలోనే చింతామణి నాటకంపై వివాదం మరింత ముదిరి పాకాన పడింది. అప్పట్లో ఆ నాటకంపై కొన్ని ఆంక్షలు కూడా అమలయ్యాయి.

అయినా, ఈ రోజుల్లో చింతామణి నాటకం వేస్తున్నదెవరు.? దాన్ని చూస్తున్నదెవరు.? పనిగట్టుకుని చింతామణి నాటక నిషేధం అంశాన్ని రాజకీయ కోణంలో కొందరు తెరపైకి తెచ్చారన్న విమర్శలున్నాయి. నాటకంపై నిషేధం విధింపబడటంతో, తాము వీధిన పడ్డామంటూ నాటక సమాజానికి చెందిన చాలామంది కళాకారులు రోడ్డెక్కారు.

‘మా పొట్ట కొట్టొద్దు మహాప్రభో..’ అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు నాటక రంగ కళాకారులు. ఇదీ వివాదం. అయితే, ‘చింతామణి’ నాటకంలో సుబ్బి శెట్టి పాత్రని తొలగించేసి ఏ సుబ్బారావు అనో, అప్పారావు అనో పెట్టేస్తే.. వివాదానికే ఆస్కారముండదు.

చిన్న ‘మార్పు’ చేస్తే సరిపోయేదానికి, నాటక నిషేధం వరకూ వెళ్ళింది. సరిగ్గా ఇక్కడే రఘురామ, ‘నేను గెలిచేస్తా..’ అన్న ధీమాతో కోర్టును ఆశ్రయించారు. రఘురామ గనుక తాను అనుకున్నది సాధిస్తే.. జగన్ సర్కారుకీ, అధికార వైసీపీకీ పెద్ద తలనొప్పే అవుతుందది.