ఆంధ్రప్రదేశ్ జగన్ సర్కార్ పై మరో కొత్త పాయింట్‌తో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాఘురామ్ సొంత నియోజకవర్గంలో జరిగిన ఒక దారుణమైన ఘటన పై ఏపీ ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. కరోనా సోకిన వ్యక్తిని చెత్తను తరలించడానికి వాడే మున్సిపాలిటి బండిలో తీసుకెళ్లటం ఎంతో బాధాకరమని, తాజాగా జరిగిన ఈ ఘటన పై తాను సిగ్గుతో తలదించుకుంటున్నానని, తన నియోజకవర్గంలో ప్రజలు తనని క్షమించాలని రాఘురామ్ కోరారు.
కరోనా రోగుల కోసం, కొత్త అంబులెన్సులను ఆడంబరంగా ప్రారంభించిన జగన్ సర్కార్, ప్రచారానికి తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడడంలేదన్నారు. ఇక కరోనా టెస్టుల విషయంలో కూడా స్పందించిన రఘురామ్.. యాంటిజెన్ టెస్టులు అంత ఉపయోగకరం కాదన్నారు. ఈ క్రమంలో ట్రూనాట్, ఆర్టీ పీసీఆర్ టెస్టుల ద్వారానే కరోనా కచ్చితంగా గుర్తించగలమని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఏపీలో కరోనా సామాజిక వ్యాప్తి జరిగిందని, త్వరలోనే కరోనా కేసుల విషయంలో ఏపీ నెంబర్ వన్‌కు చేరుకుంటుదన్నారు. ఇక రాష్ట్రంలో ప్రతిదానికి సీయం జగన్ పేరు పెడుతున్న నేపధ్యంలో, కరోనా చర్యలకు కూడా జగన్ కోవిడ్ కేర్ అని పెట్టాలని రఘురామ్ సెటైర్ వేశారు. మరి ఈ ఎంపీ వ్యాఖ్యల పై వైసీపీ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.