జైలుకు వెళ్ళకుండా వుండేందుకోసం చాలా ప్రయత్నాలు చేశారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. రాజద్రోహం సహా పలు అభియోగాల కింద రఘురామపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం విదితమే. హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నిస్తే కుదరలేదు.. సెషన్స్ కోర్టులోనూ విచారణ అనంతరం రిమాండ్ తప్పలేదు. అనారోగ్య కారణాలతో వైద్య చికిత్స.. అన్నారు. ఆ వైద్య చికిత్స, పరీక్షల అనంతరం జైలుకు తరలించారు ఏపీ సీఐడీ అధికారులు, రఘురామకృష్ణరాజుని. ఇక్కడితో, ఓ అంకం పూర్తయ్యిందని అనుకోవాలేమో. నిజానికి, వైద్య పరీక్షలు.. ప్రభుత్వాసుపత్రితోపాటు, ప్రైవేటు ఆసుపత్రిలోనూ చేయించాలని న్యాయస్థానం ఆదేశించింది. కానీ, ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత ఆయన్ని జైలుకు తరలించారు అదికారులు. దాంతో, ఈ వ్యవహారం మళ్ళీ వివాదాస్పదమయ్యేలా వుంది. తనను అరెస్టు చేసిన అనంతరం, తీవ్రంగా పోలీసులు కొట్టారనీ, ఆ కారణంగా తన కాలికి గాయాలయ్యాయని రఘురామ ఆరోపిస్తున్న సంగతి తెలిసింది.
ఈ ఆరోపణల నేపథ్యంలోనే, ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలకు న్యాయస్థానం ఆదేశించింది. ఇంతకీ, ఆ పరీక్షల్లో ఏం తేలింది.? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. రఘురామ డ్రామా తప్ప, ఆయన్నెవరూ కొట్టే పరిస్థితి లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక, ఇప్పుడు రఘురామ ముందున్న ఆప్షన్ ఒకటే.. బెయిల్ కోసం ప్రయత్నించడం. రేపు ఆ ప్రయత్నాలు సఫలమవుతాయా.? ఎంతకాలం పాటు రఘురామ జైల్లో వుంటారు..? అన్నదిప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ‘రఘురామ అరెస్టుతో ప్రభుత్వానికి సంబంధంలేదు.. ఇది కక్ష సాధింపు చర్య కాదు.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది..’ అంటున్నారు ప్రభుత్వ పెద్దలు. చూద్దాం. ఏం జరుగుతుందో ఈ కేసులో ముందు ముందు.