మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తోన్న రఘురామకృష్ణరాజు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మళ్ళీ చెలరేగిపోతున్నారు. రచ్చబండ అనే కార్యక్రమం పేరు లేదుగానీ, రచ్చబండ పేరుతో చేసిన రచ్చనే ఇప్పుడు మళ్ళీ కొనసాగుతున్నారు. ఆ రచ్చ బండ వల్లనే రఘురామపై రాజద్రోహం కింద కేసులు నమోదయిన విషయం విదితమే. అరెస్టయ్యారు.. ఏపీ సీఐడీ తన మీద థర్డ్ డిగ్రీ టార్చర్ ప్రయోగించిందని అన్నారు.. నానా యాగీ జరిగింది. ఈ విషయాలపై మీడియాతో మాట్లాడొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో రఘురామ కొన్నాళ్ళు సైలెంటయ్యారు. కానీ, మళ్ళీ మొదలెట్టేశారు. ఎడాపెడా వైఎస్ జగన్ ప్రభుత్వం మీదా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీదా తీవ్రాతి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. తాజా ప్రెస్‌మీట్‌లో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సహా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదా విరుచుకుపడ్డారు రఘురామ. సలహాదారుల విషయమై హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ, సజ్జల రామకృష్ణారెడ్డికి సిగ్గులేదంటూ మండిపడ్డారు. విదేశాలకు వెళ్ళేందుకు పర్మిషన్ విషయమై.. విజయసాయిరెడ్డి మీద మాట తూలేశారు ఈ రెబల్ ఎంపీ.

ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఏ1 అంటూ విమర్శించారాయన. ఇవన్నీ దేనికోసం.? మీకు చేతనైతే నన్ను పార్టీ నుంచి బయటకు పంపండి.. మీకు అది చేతకాదుగానీ, నా మీద అనర్హత వేటు వేయిస్తారా.? అంటూ ఎగతాళి చేశారు వైసీపీ మీద రఘురామ. అంతలోనే, ముఖ్యమంత్రి అంటే తనకిష్టమనీ, పార్టీ పట్ల తనకు అపారమైన గౌరవం వుందనీ.. రఘురామ అత్యద్భుతమైన నటనను ప్రదర్శించేశారు. అన్నట్టు, రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలైన స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్ట్, రైల్వే జోన్, ప్రత్యేక హోదా వంటి అంశాలపై కేంద్రం తీరుని నిరసిస్తూ రాజీనామాకు తాను సిద్ధమనీ, వైసీపీ ఎంపీలంతా తనతోపాటు రాజీనామాకి సిద్ధపడాలనీ రఘురామ పిలుపునిచ్చారు. ఏంటో, ఇంకోసారి రఘురామ.. ఏపీ సర్కార్ నుంచి చేదు పరిస్థితుల్ని కొనితెచ్చుకోవాలనుకుంటున్నట్టున్నారు.. ఆ ముచ్చటా ఇంకోసారి ఆయనకు తీరిపోతుందేమో.!