ఇప్పుడేం జరుగుతుంది.? వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర హోశాఖకు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో కేంద్ర హోం శాఖ నుంచి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ వచ్చిపడింది. ఆ లేఖ సారాంశమేంటంటే, ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్, సమాజంలో అలజడి సృష్టించేలా మాట్లాడారనీ, సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించారనీ రఘురామ ఫిర్యాదు చేసిన దరిమిలా, ఆ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలి.. అలా తీసుకున్న చర్యలేంటో కేంద్రానికి నివేదించాలి. రాజద్రోహం కేసులో ఏపీ సీఐడీ ఇటీవలే రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసిన విషయం విదితమే.
ఏపీ సీఐడీ సునీల్ కుమార్ కుట్ర పూరితంగా వ్యవహరించి తన మీద కేసు బనాయించారన్నది రఘురామ ఆరోపణ. అంతే కాదు, గతంలో ఓ సందర్భంలో రఘురామ రెచ్చగొట్టేలా మాట్లాడారనీ, హిందూ మత విశ్వాసాలు దెబ్బతినేలా వ్యవహరించారనీ రఘురామ ఆరోపించారు. ఈ మేరకు కేంద్రానికి ఆయన ఫిర్యాదు చేశారు కూడా.
బ్రిటిష్ వారి వల్లనే దళితులకు ఏసుక్రీస్తు అనే దేవుడు దొరికాడని సునీల్ కుమార్ ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎస్ అధికారి అయిన సునీల్ కుమార్ విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సునీల్ కుమార్ వ్యవహారానికి సంబంధించిన ప్రసంగ వీడియోలను కూడా కేంద్ర హోంశాఖ, రాష్ట్రానికి పంపడం గమనార్హం.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సునీల్ కుమార్ మీద రఘురామ చేసిన ఆరోపణలు, కేంద్రం నుంచి వచ్చిన లేఖాస్త్రంపై ఎలా స్పందిస్తారు.? చీఫ్ సెక్రెటరీ లెవల్‌లోనే వ్యవహారం చక్కబడుతుందా.? వేచి చూడాల్సిందే.