వైసీపీకి గత కొంతకాలంగా దూరంగా వుంటోన్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, త్వరలో రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారట. ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. కాదు కాదు, ఆయనకు టీడీపీ గాలం వేస్తోందన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. వైసీపీకి దూరమయ్యాక, రఘురామ.. మరో పార్టీలో చేరాలన్న ఆలోచనతో ఇప్పటిదాకా కనిపించలేదు. నిజానికి, ఆయనకి వివిధ పార్టీల నుంచి ఆఫర్స్ వున్నాయి. ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో నేరుగా సన్నిహిత సంబంధాలున్నాయి రఘురామకృష్ణరాజుకి. మరీ ముఖ్యంగా, బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఆయన ఎప్పుడంటే అప్పుడు కలవగలరు. అంతటి చనువు ఆయనకు బీజేపీలో వుంది.
ఆ చనువుతోనే, వీలు చిక్కినప్పుడల్లా.. బీజేపీ అగ్ర నాయకత్వంతోనూ, కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనూ మంతనాలు జరుపుతుంటారు రఘురామకృష్ణరాజు. కష్ట కాలంలోనూ ఆయనకు ఆయా పార్టీల నుంచి మద్దతు అలాగే లభిస్తోంది. మరీ ముఖ్యంగా, బీజేపీ నుంచి ఆయనకు అంచనాలకు మించిన మద్దతు లభిస్తోంది. ఇంకోపక్క ఎలాగైనా రఘురామకృష్ణరాజుని తమవైపుకు తిప్పుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ, బీజేపీని వ్యతిరేకించకపోవచ్చు. టీడీపీ, బీజేపీ కలిసే ముందడుగు వేయాలన్న దిశగా టీడీపీ అధిష్టానం పావులు కదుపుతోంది. అయితే, ఇంకోసారి టీడీపీని నమ్మలేం.. అన్నది బీజేపీలో కొందరి వాదన. టీడీ – బీజేపీ వ్యవహారాల్ని పక్కన పెడితే, రఘురామ త్వరలో బీజేపీలో చేరతానే ప్రచారం టీడీపీ వర్గాల్లో కూడా జరుగుతోంది. మరోపక్క, జనసేన పార్టీతో కలవాలంటూ రఘురామకు, ఆయన సన్నిహితులు, అనుచరులు సూచిస్తున్నారట.