రాజద్రోహం కేసులో అరెస్టయిన ఎంపీ రఘురామకృష్ణరాజుకి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వైద్య పరీక్షలు, చికిత్స అందుతున్న విషయం విదితమే. అయితే, అక్కడ ఏం జరుగుతోంది.?అన్నదానిపై ‘తెగులు’ మీడియా ఊహాజనితమైన కథనాలను అందించడానికి వీల్లేకపోతోంది. అయినప్పటికీ కూడా తనవంతు కష్టమైతే ఈ తెగులు మీడియా పడుతూనే వుంది. ఆసుపత్రికి కూతవేటు దూరంలోనే ఎవర్నీ లోపలికి రానీయకుండా ఆర్మీ వర్గాలు చర్యలు చేపట్టడంతో, అక్కడినుంచే కవరేజ్ ఇచ్చేస్తున్నాయి. ఫలానా తరహా వైద్య పరీక్షలు జరిగే అవకాశముంది.. ఫలానా విధంగా కోర్టుకు వివరాలు అందించే అవకాశముంది.. అంటూ కథనాలు వండి వడ్డించడం తప్ప, కీలకమైన అంశాలపై ఎలాంటి సమాచారం ఇవ్వలేకపోతోంది ప్రజలకు ఈ తెగులు మీడియా. అదే, ఏ ప్రభుత్వాసుపత్రిలోనో, ప్రైవేటు ఆసుపత్రిలోనే రఘురామకు వైద్య పరీక్షలు, చికిత్సకు అవకాశం కల్పిస్తే, వున్నదీ లేనిదీ పులిహోర కలిపేసేదే.
పైగా, లీకులు ఇలాంటి విషయాల్లో చాలా ఘాటుగా బయటకు వస్తుంటాయి. అవేవీ లేకపోవడంతో తెగులు మీడియా తల్లడిల్లిపోతోంది. రఘురామకు అందుతున్న వైద్య సేవలు, ఆయనకు చేసిన వైద్య పరీక్షల ఫలితాల తాలూకు వివరాల్ని సీల్డ్ కవర్ ద్వారా సుప్రీంకోర్టుకు తెలంగాణ హైకోర్టు పంపనుంది. ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తయ్యిందనే ప్రచారం జరుగుతున్నా, ఆ వ్యవహారంపై పూర్తి స్పష్టత లేదు. ఈ నెల 21న విచారణ సందర్భంగా మాత్రమే, రఘురామ వ్యవహారంపై ఓ స్పష్టత రావొచ్చు. ఆ రోజే రఘురామ బెయిల్ మీద కూడా స్పష్టత వస్తుంది. ప్రస్తుతం వున్న పరిస్థితుల్ని.. అంటే, కరోనా పాండమిక్ నేపథ్యంలో రఘురామకు బెయిల్ వచ్చే అవకాశాలే వున్నాయన్నది న్యాయ నిపుణుల వాదన. అదే జరిగితే, రఘురామ ఖచ్చితంగా చెలరేగిపోతారనుకోండి.. అది వేరే సంగతి.