ఢిల్లీలో రఘురామకృష్ణరాజు వీల్ ఛెయిర్ రాజకీయం

Raghu Rama Delhi Times Wheelchair Politics

Raghu Rama Delhi Times Wheelchair Politics

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో ఎక్కే గుమ్మం దిగే గుమ్మం.. అన్నట్టు నానా తంటాలూ పడాల్సి వస్తోంది.. అదీ వీల్ ఛెయిర్ సాయంతో. తనను ఏపీ సీఐడీ కస్టడీలో కొట్టారంటూ కోర్టుకు విన్నవించుకున్న రఘురామ, బెయిల్ మీద ఇటీవల విడుదలై ఢిల్లీకి చేరుకుని, అక్కడ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరాలనుకున్నారుగానీ.. ఆ వ్యూహం వర్కువుట్ అయినట్లు లేదు. తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వద్ద తన పరిస్థితిని వివరించారట, జగన్ ప్రభుత్వం తనను వేధిస్తోందంటూ ఫిర్యాదు చేశారట. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో రఘురామకు సన్నిహిత సంబంధాలే వున్నాయి. అయితే, టీడీపీకి బాకా ఊదుతున్నందున రఘురామను కమలనాథులు పెద్దగా పట్టించుకోవడంలేదు.

ఎంపీ గనుక, ఢిల్లీలో రఘురామ కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవడం పెద్ద విషయమేమీ కాదు. పైగా, ఆయనకు బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయా నేతల్ని కలిసి రఘురామ ఏం చెబుతున్నారనే విషయాన్ని పక్కన పెడితే, వీల్ ఛెయిర్ సాయంతో రఘురామ కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్దకు వెళుతుండడాన్ని ఓ పబ్లిసిటీ స్టంటుగా చాలామంది అభివర్ణిస్తున్నారు. మీడియాతో మాట్లాడేందుకు వీల్లేకుండా సుప్రీంకోర్టు బెయిల్ ఉత్తర్వుల్లో షరతులు విధించిన దరిమిలా, రఘురామకి అస్సలేమీ ఊసుపోవట్లేదట. ఆ ఒక్క షరతూ లేకపోయి వుంటే, పరిస్థితి ఇంకోలా వుండేది. ఇక, రఘురామ త్వరలో బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ, రఘురామ పూటకో పార్టీ మార్చే రకం.. అన్న భావనతో బీజేపీ ఆయన్ని దూరం పెడుతున్నట్లుగా ఢిల్లీ నుంచి అందుతున్న లీకుల్ని బట్టి తెలుస్తోంది. ఒక్కటి మాత్రం నిజం.. వైసీపీలోనే సర్దుకుపోయి వుంటే, రఘురామకి ఎంతో గౌరవం దక్కి వుండేది. ఇదంతా రఘురామ స్వయంకృతాపరాధమే.