రేసింగులకీ.. రైడింగులకీ తేడా తెలియట్లేదా.?

riding Vs racing

riding Vs racing

కుర్రాళ్ళు రేసింగులకి పాల్పడటం గురించి తరచూ వింటుంటాం. అలాంటి రేసింగుల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.. కోల్పోతున్నారు కూడా. మరి, సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ విషయంలో ఏం జరిగింది.? ఆయన రేసింగులో పాల్గొన్నాడా.? ఆయనతోపాటు సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ (ఈయనా నటుడే) కూడా రేసింగ్ చేశాడా.? ఈ రేసింగ్ కారణంగానే సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడా.? మీడియాలో రకరకాల స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. ఈ అంశంపై సీనియర్ నటుడు నరేష్ మీడియాతో మాట్లాడారు.

యువ నటులు బైక్ రైడింగ్స్ చేయడాన్ని తాను సమర్థించననీ, వారికి మంచి భవిష్యత్తు వుందనీ, చిన్న ప్రమాదం జరిగినా, కుటుంబం ఇబ్బందుల్లో పడుతుందనీ, సినిమా నిర్మాతలూ సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుందనీ సర్వసాధారణమైన విశ్లేషణ చేశాడాయన. తాను కూడా ఒకప్పుడు బైక్ రైడర్‌ననీ, బైకులంటే తనకూ ఇష్టమేననీ, కానీ ఓ ప్రమాదం తర్వాత బైక్ రైడింగ్ చేయబోనని తన తల్లికి మాటిచ్చాననీ, తన కుమారుడికీ.. అలాగే తన కుమారుడి లాంటి సాయి ధరమ్ తేజ్‌కీ బైక్ రైడింగ్ విషయమై హెచ్చరిస్తుంటాననీ నరేష్ చెప్పుకొచ్చాడు.

ఈ రైడింగ్ అనే పదాన్ని ఓ సెక్షన్ మీడియా రేసింగ్ అనే అర్థంలో తీసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో సాయి ధరమ్ తేజ్ మరీ అంత ఎక్కువ వేగంతో ఏమీ వెళ్ళడంలేదు. ఇసుక కారణంగా రోడ్డు మీద బైక్ స్కిడ్ అయినట్లు సాక్షాత్తూ పోలీసులే చెబుతున్నారు. మరి, రేసింగ్ అన్న ప్రస్తావన ఓ సెక్షన్ మీడియా ఎందుకు తీసుకొస్తోంది.? అన్నదే కీలకం ఇక్కడ. పనిగట్టుకుని మెగా కాంపౌండ్ మీద బురద చల్లే ప్రయత్నం ఆ సెక్షన్ మీడియా చేయడం వెనుక అసలు కారణమేంటోగానీ.. పూర్తిస్థాయిలో సదరు మీడియా ఈ ఘటనకు సంబంధించి పరువు పోగొట్టుకుందన్నది నిర్వివాదాంశం.