టోక్యో ఒలింపిక్స్: బ్యాడ్మింటన్ సెమీస్ పోరులో పి.వి సింధు వరుస సెట్లలో ఓటమి పాలై బంగారు పతక వేటలో నిష్క్రమించింది. చైనీస్ తైపీ ప్లేయర్ తై జు యింగ్ తో శనివారం జరిగిన మ్యాచ్లో 21-18, 21-12 తేడాతో వరుస సెట్లలో పరాజయం చవిచూసింది. ఆట ప్రారంభంలో సింధు దూకుడుగా ఆడినప్పటికి విరామం తరువాత తై జు యింగ్ పుంజుకుని ఆధిపత్యం చెలాయించింది. తొలి సెట్ హోరాహోరీగా సాగినప్పటికీ రెండో సెట్లో మాత్రం తై జు దూకుడు ముందు సింధు నిలవలేకపోయింది. దీంతో వరుస సెట్ల పరాజయంతో మ్యాచ్ చేజార్చుకుంది.
ఈ ఇద్దరు ఇప్పటివరకు మొత్తం 19 సార్లు తలపడగా సింధు కేవలం 5 సార్లు మాత్రమే గెలిచింది. ఈ ఓటమి నుండి తేరుకున్న సింధు కాంస్య పతక పోరుపై దృష్టిసారించింది. మరో సెమిస్ మ్యాచ్లో ఓడిన చైనీస్ క్రీడాకారిణి హి బింగ్ జియావోతో ఆదివారం జరిగే ఆటలో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలుపొందిన వారికి కాంస్యం దక్కనుంది. అయితే పీవీ సింధు ఓడిపోవడంపై ఆమె తండ్రి రమణ స్పందించారు. “వరల్డ్ ఛాంపియన్ తైజూ వ్యూహాత్మకంగా ఆడిందని… ఎటాకింగ్ కు దిగి ఎక్కడా కూడా సింధుకు ఛాన్స్ ఇవ్వలేదని అన్నారు. రేపటి మ్యాచ్లో సింధు బాగా ఆడి కాంస్య పతకం సాధిస్తుందని” ఆశాభావం వ్యక్తం చేశారు.