భారత షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధూ త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త గౌరవెల్లి వెంకటదత్త సాయి తో సింధూ వివాహం డిసెంబర్ 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనుంది. వెంకటదత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ వివాహం కుటుంబ సన్నిహితులు, ప్రముఖుల సమక్షంలో ఎంతో గ్రాండ్‌గా జరుగనుందని సమాచారం.
పీవీ సింధూ తండ్రి పీవీ రమణ పలు ఆసక్తికర వివరాలు షేర్ చేసుకున్నారు, ఇరు కుటుంబాలు చాలా కాలంగా పరిచయం ఉన్నవే. గత నెలలోనే వివాహ నిర్ణయం తీసుకున్నామని, సింధూ షెడ్యూల్ బిజీగా ఉండడం వల్ల ఈ నెలలోనే పెళ్లి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పెళ్లి వేడుకలు డిసెంబర్ 20న ప్రారంభమవుతాయి. ప్రముఖ సినీ, క్రీడా రంగ ప్రముఖులను ఈ గ్రాండ్ వేడుకకు ఆహ్వానించనున్నారు. పెళ్లి అనంతరం డిసెంబర్ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.
సింధూ కెరీర్ గురించి చెప్పాలంటే, ఆమె భారతీయ బ్యాడ్మింటన్‌లో ఒక ఐకాన్. 2013లో వరల్డ్ ఛాంపియన్‌షిప్ పతకం గెలవడం ద్వారా సింధూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి భారత గర్వంగా నిలిచింది. 2017లో తొలిసారి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరిన సింధూ, ఆ తర్వాతి రోజుల్లో భారత బ్యాడ్మింటన్‌కు స్ఫూర్తిగా మారింది.