Pubs and Drugs : పబ్బుల్లో డ్రగ్స్ దొరుకుతాయ్.! పబ్బుకి వెళ్ళేవాళ్ళలో నూటికి తొంభై మందికి ఈ విషయం తెలుసు. ఏ పబ్బు ఎంతవరకు అదనపు సమయం నడుస్తుందో అందరికీ తెలుసు.
కానీ, పబ్బులు అర్థ రాత్రి దాటాక కూడా నడుస్తున్నా, పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా జరుగుతున్నా పోలీసులు అటువైపుగా ఎందుకు చూడటంలేదు.?
చూడకనేం, చూస్తున్నారు కాబట్టే.. పబ్బులపై పోలీసు దాడులు.. నిందితుల అరెస్టులు.!
ఈ క్రమంలోనే డ్రగ్స్ కోణాలు బయటకొస్తున్నాయ్.. దాని చుట్టూ మళ్ళీ లోతైన విచారణలూ జరుగుతున్నాయి.
పోలీసుల్ని ఈ విషయంలో పూర్తిగా తప్పు పట్టేయలేం. అలాగని, పబ్బు గబ్బు విషయమై పోలీసుల్ని సమర్థించలేం కూడా. పోలీసు శాఖలోనూ వైఫల్యాలున్నాయ్. ప్రభుత్వ పరంగానూ చాలా వైఫల్యాలున్నాయ్. ఇక, సెలబ్రిటీల సంగతి సరే సరి.
ఎన్నిసార్లు పబ్బుల మీద పోలీసులు దాడులు చేసినా, అరెస్టులు చేస్తున్నా.. సెలబ్రిటీల పిల్లలు పబ్బుల జోలికి వెళ్ళడం మానట్లేదు. అక్కడ జరిగే అసాంఘీక కార్యకలాపాలకూ దూరంగా వుండటంలేదు. కోడి ముందా.? గుడ్డు ముందా.? అన్నట్టు తయారైంది వ్యవహారం.
పబ్బులు నడుస్తున్నాయ్ కాబట్టి ఆ కల్చర్‌కి అలవాటుపడేవారు అడ్డమైన వేషాలూ వేస్తారు. సో, పబ్బులకు అనుమతులు ఇవ్వడమే తప్పన్నది ఓ వాదన. ఇదొక పరిష్కారం లేని సమస్య.! పబ్బుల ద్వారా వచ్చే ఆదాయం పట్ల ప్రభుత్వాల్ని నడిపేవారికి వుండే ఆసక్తే..
ఈ పైత్యానికి కారణంగా చెప్పుకోవచ్చు.
ప్రతి క్షణం పబ్బుల మీద నిఘా పెట్టడం అనేది పోలీసు వ్యవస్థకు సాధ్యం కాదు. అలాగని, పబ్బుల్ని అలా గాలికొదిలేయడానికీ వీల్లేదు. ఇక్కడ నేరం అందరిదీ.!