Professor Kodandaram : ఆమ్ ఆద్మీ పార్టీ వైపుగా ప్రొఫెసర్ కోదండరామ్ అడుగులు.?

Professor Kodandaram : తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితికి అండగా నిలిచారు ప్రొపెసర్ కోదండరామ్. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే కోదండరామ్‌ని కేసీయార్ పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే. మిలియన్ మార్చ్ సమయంలో కోదండరామ్ సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారన్నది అప్పట్లో కేసీయార్ సన్నిహితులు చేసిన ఆరోపణ.
కారణాలైవేతేనేం, కేసీయార్ – కోదండరాంల మధ్య వివాదం తలెత్తింది. ఇరువురూ విడిపోయారు. ప్రొఫెసర్ కోదండరామ్ ఆ తర్వా తెలంగాణ జన సమితి పేరుతో ఓ పార్టీ పెట్టారు. కానీ, ఈ టీజేఎస్ తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయలేకపోయింది. అయినాగానీ, పార్టీని అలా అలా నడుపుతూనే వున్నారు కోదండరామ్. ఆ పార్టీ ఇన్నేళ్ళు అలా అలా నడవడానికి కారణం మేధావి వర్గమే.
ఇప్పుడు ఆ పార్టీ విలీనం దిశగా అడుగులేస్తోందట. ఆమ్ ఆద్మీ పార్టీలో తెలంగాణ జన శక్తిని విలీనం చేయాలంటూ స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కోరారట. అయితే, విలీనం చేయకుండా ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎలా వుంటుందన్నదానిపై కోదండరామ్ పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారని తెలుస్తోంది.
గతంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి కూడా విలీన ప్రతిపాదనలు తెలంగాణ జన సమితి ముందుకొచ్చాయి. వాటిని కోదండరామ్ సున్నితంగా తిరస్కరించారు. కానీ, ఆమ్ ఆద్మీ పార్టీలో తెలంగాణ జన సమితి విలీనంపై కోదండరామ్ కూడా సానుకూలంగానే వున్నట్లు తెలుస్తోంది.