ప్రైవేట్ హెల్త్ అండ్ మెడికల్ మాఫియా జూలు విదుల్చుతోంది..

Private Health and Medical Mafia Shocking Behaviour

Private Health and Medical Mafia Shocking Behaviour

ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడం సబబు కాదంటూ ప్రముఖ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాహకులైన డాక్టర్లు మీడియా ముందుకొచ్చి సుద్దులు నేర్పుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు అత్యద్భుమైన సేవల్ని, అత్యంత బాధ్యతగా అందించామనీ, ఈ క్రమంలో తాము చాలా త్యాగాలు చేశామని ఆయా హాస్పిటల్స్ నిర్వాహకులు చెబుతుండడం గమనార్హం.

ప్రైవేటు ఆసుపత్రులు సేవ చేస్తున్నాయా.? ప్రైవేటు ఆసుపత్రులు వైద్యం చేస్తున్నాయా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయిప్పుడు చాలామందికి. కరోనా వచ్చినవారిలో నూటికి 90 మందికి ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలూ రావడంలేదని గణాంకాలు చెబుతున్నాయి. చాలా తక్కువమందికే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం వస్తోంది. అందులోనూ చాలా తక్కువమందికి ఆక్సిజన్, వెంటిలేటర్ వంటివి అవసరమవుతున్నాయి. కానీ, చిన్నపాటి లక్షణాలతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళినా లక్షల్లో ఫీజులు వేసి, విగత జీవులుగా కరోనా బాధితుల్ని బయటకు పంపుతున్నారన్న విమర్శలున్నాయి.

ఉత్త విమర్శలు కావు, అర కోటికి పైగా వసూలు చేసి.. ప్రాణాలు కాపాడకుండా, మృతదేహాన్ని ఇచ్చేందుకూ అదనపు సొమ్ముని డిమాండ్ చేసిన ఆసుపత్రులున్నాయి. ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వ చర్యలపై అసహనం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. కార్పొరేట్ ఆసుపత్రులంటే ఫైవ్ స్టార్, సెవన్ స్టార్ తరహా సౌకర్యాలతో ఏర్పాటవుతున్నాయి.అన్నిటిలోనూ అలాంటి సౌకర్యాలుండడంలేదు.. ఫీజులు మాత్రం అన్నిటిలోనూ దాదాపు ఒకేలా వుంటున్నాయి.

ప్రభుత్వాసుపత్రులకంటే మెరుగైన చికిత్స అక్కడ అందుతోందా.? అంటే, పైకి కోటింగ్ మాత్రమే తప్ప, వైద్యంలో నాణ్యత అంత లేదన్నది స్వయంగా అనుభవించేవారు చెప్పేమాట. ‘పాపం ప్రైవేటు ఆసుపత్రులు..’ అంటూ కొన్ని మీడియా సంస్థలు వారి తరఫున వకాల్తా పుచ్చుకోవడమంటే, కార్పొరేట్ మెడికల్ మాఫియా నుంచి ఎంత మొత్తం ముట్టుతోందో మరి.?