Prime Minister On Road : నడిరోడ్డుపై ప్రధాని.. దేశానికే అవమానం.!

Prime Minister On Road : మీకర్థమవుతోందా.? ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ నడి రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బందుల్లో ఇరుక్కుపోయిందంటే, అది భద్రతా వైఫల్యంగా భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటోందంటే, ఇంతకన్నా దేశానికి అవమానకరమైన విషయం ఇంకేముంటుంది.?

పంజాబ్ ప్రభుత్వ వైఫల్యమిది.. కుట్రపూరితంగానే పంజాబ్ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అవమానించింది, ఆయన భద్రతకు ముప్పు వాటిల్లేలా చేసింది.. అంటూ దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు, బీజేపీకి మద్దతిస్తున్న పార్టీల నేతలూ వివిధ రూపాల్లో తమ ఆవేదన వ్యక్తం చేసేస్తున్నారు.

ఇక్కడ బీజేపీ ఆడుతున్న పొలిటికల్ గేమ్ సుస్పష్టం. అయితే, బీజేపీ పాలనా వైఫల్యాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించుకుని తీరాలి. కేంద్రంలో అధికారం వెలగబెడుతోన్న బీజేపీ, ప్రధాన మంత్రికి సరైన భద్రత, సరైన ప్రోటోకాల్ పాటించలేనంత అసమర్థత ప్రదర్శించిందన్నమాట.

అబ్బే, ఇది పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని కమలనాథులు చెప్పుకోవచ్చుగాక. కానీ, ఇది పూర్తిగా కేంద్ర హోం శాఖ వైఫల్యమే. ప్రధాన మంత్రి అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ప్రధాన మంత్రికి లభిస్తుంది.

ప్రధాన మంత్రి అడుగు తీసి అడుగు వేయాలంటే దానికి ఓ పెద్ద తతంగం వుంటుంది. అలాంటప్పుడు, ప్రధాని వెళ్ళే మార్గంలో ట్రాఫిక్ ఎలా జామ్ అవుతుంది.? ఇక్కడ సెక్యూరిటీ వైఫల్యం సుస్పష్టం. ప్రధాని భద్రత బాధ్యత కేంద్ర హోం శాఖది. అంటే, ఆ శాఖ మంత్రి అమిత్ షా ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహించాలి.

అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేయాల్సింది పోయి, పంజాబ్ ప్రభుత్వం మీద కమలనాథులు ఏడుస్తారేంటి.?