ద్రైపది ప్రెసిడెంట్ అయితే, కౌరవులెవరు.? పాండవులెవరు.?

‘అంతా నా ఇష్టం’ అంటాడు రామ్ గోపాల్ వర్మ. అదంతా మన ఖర్మ.. అని జనం అనుకోవాల్సిన పరిస్థితి. ఎప్పుడో చాలా కాలం క్రితం గొప్ప సినిమాలు తీశాడాయన. కానీ, ఇప్పుడు కేవలం వివాదాలతోనే సరిపెడుతున్నాడు. ఏ విషయాన్ని కెలికితే, ఎలా వివాదం పుట్టుకొస్తుందో, తద్వారా తనకెంత పబ్లిసిటీ వస్తుందో లెక్కలేసుకుని మరీ రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగుతాడు.

తాజాగా, ప్రెసిడెంట్ ద్రౌపది గురించి రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ద్రౌపది ప్రెసిడెంట్ అయితే, పాండవులెవరు.? కౌరవులెవరు.? అని సోషల్ మీడియా వేదికగా అమాయకంగా ట్వీటేశాడు. ప్రస్తుత రాజకీయాలపై రామ్ గోపాల్ వర్మ మార్కు ‘పైత్యం’గా దీన్ని అభివర్ణించాలేమో.

భారత రాష్ట్రపతిగా ద్రౌపది మర్ము ఎన్నిక కానున్నారు. ఇక్కడ పాండవులు ఎవరు.? కౌరవులు ఎవరు.? అన్న ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుంది.? ఇంతకీ, ఈ వ్యవహారంలో కృష్ణుడెవరు.? అబ్బో, ప్రశ్నించుకుంటూ పోతే చాలానే వుంటాయ్. ‘పైత్యం’ ప్రదర్శిస్తే ఇలాగే వుంటుంది.

‘అమ్మా’ అన్న పిలుపులో ఒకడికి ఆప్యాయత కనిపిస్తుంది, ఇంకొకడికి ‘ఏదో మూమెంట్’ గుర్తుకొస్తుంది. రామ్ గోపాల్ వర్మ రెండో టైపు.. అన్నది సర్వత్రా వినిపించే విమర్శ. పబ్లిసిటీ కోసం ఏం చేయడానికైనా వర్మ వెనుకాడడు. అదే ఆయన ప్రత్యేకత. ప్రెసిడెంట్ అంటే, దేశ ప్రధమ పౌరుడు లేదా పౌరురాలు. ఆ పదవికి ఎన్నిక కాబోయే వ్యక్తి గురించి, ఇంత నీఛంగా వర్మ ఎలా ప్రశ్నించినట్టు.? ఎందుకంటే ఆయన వర్మ కాబట్టి.. అది జనాల ఖర్మ కాబట్టి.!

కాదేదీ వివాదానికనర్హం.. అని వర్మ బలంగా నమ్ముతాడు. తన తాజా చిత్రం ‘కొండా’ ప్రమోషన్ నిమిత్తం, ఇదిగో ఇలాంటి వెర్రి వేషాలు వర్మ వేయడంలో వింతేమీ లేదు. ‘నేను ద్రౌపది అన్నానుగానీ, ద్రౌపది మర్ము అనలేదు కదా.. నేను ప్రెసిడెంట్ అన్నానుగానీ, భారత ప్రెసిడెంట్ అనలేదు కదా..’ అని నాలిక మడతేయడం వర్మకి కొత్తేమీ కాదు.