హీరోగా నిలదొక్కుకోవడానికి అక్కినేని అఖిల్ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తొలి సినిమా నుంచీ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మొత్తానికి ముచ్చటగా మూడు సినిమాలు అవుట్ అనిపించుకోగా, నాలుగో సినిమాతో హిట్ కొట్టేశాడు.
దసరా కానుకగా వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ టాక్ పరంగా చిన్నా చితకా తేడాలున్నప్పటికీ, వసూళ్ల పరంగా బాగానే దూసుకెళ్తోంది. దసరా సెలవులు బాగానే కలిసొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్‌లోనూ ‘బ్యాచిలర్’ పాజిటివ్ టాక్ సంపాదించుకోగలిగింది.
అదే ఊపుతో రీసెంట్‌గా థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఇప్పుడు సక్సెస్ మీట్‌నీ సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ సక్సెస్ మీట్‌కి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నాడు.
ఇదిలా ఉంటే, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’గా అఖిల్ సక్సెస్ అవ్వడానికి నూటికి నూరు శాతం పూజా హెగ్దేనే కారణం అంటూ సోషల్ కోడి కాస్త గట్టిగానే కూత కూస్తోంది. ఏదేమైతేనేం, మొత్తానికి అఖిల్ ఆశలు ఫలించాయి. పూజా హెగ్దే ఓ కారణం అనుకున్నా, అఖిల్ ఖాతాలో ఓ సక్సెస్ అయితే పడినట్లే. ఈ ఊపుతో అఖిల్ తన తదుపరి ప్రాజెక్టులు మరింత ఉత్సాహవంతంగా పూర్తి చేసేయొచ్చు మరి.