పొలిటికల్ వైరస్: కోవిడ్ 19 బారిన పడ్డ కేసీఆర్

Political Virus: KCR Tested Positive

Political Virus: KCR Tested Positive

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, దేశంలో కరోనా వైరస్ ‘సెకెండ్ వేవ్’కి బాధ్యత వహించాల్సింది రాజకీయమే. దేశవ్యాప్తంగా హద్దూ అదుపూ లేకుండా కరోనా వైరస్ వ్యాపించేసిందంటే దానికి కారణం రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులే. కుంభమేళా వ్యవహారం కావొచ్చు, ఎన్నికల ప్రచారం కావొచ్చు.. ఇంకోటి కావొచ్చు.. ఎలా చూసినా రాజకీయమే ఈసారి కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాజాగా కరోనా బారిన పడ్డారు.

ఈ విషయాన్ని తెలంగాణ చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ స్వయంగా ప్రకటించారు. ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం తర్వాత, కేసీఆర్ ‘ఫామ్ హౌస్’కే పరిమితమయ్యారు.. అక్కడే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. మరోపక్క, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి నోముల భగత్, ఆయన కుటుంబ సభ్యులు, పలువురు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా కరోనా బారిన పడ్డారు.

ఒక్క నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోనే తాజాగా 160 కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది కరోనా వైరస్ విషయంలో రాజకీయ తీవ్రతను చెప్పకనే చెబుతోంది. టీఆర్ఎస్ మాత్రమే కాదు, వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు కూడా కరోనా బారిన పడ్డారంటూ ప్రచారం జరుగుతోంది. ఇదిలా వుంటే, తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం కోసం వెళ్ళి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తమిళనాడులోనూ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ, కేరళ సహా పలు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరగడానికి రాజకీయ కార్యక్రమాలే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా, కరోనా వైరస్ ఇప్పుడు నియంత్రించలేని స్థాయికి వెళ్ళిపోతోందన్నది నిర్వివాదాంశం. అయినాగానీ, కరోనా పట్ల అదే నిర్లక్ష్యం చాలామందిలో కనిపిస్తోంది.