రాజకీయ సిత్రం: గులాబీ పార్టీలో ‘పసుపు’ దళం.!

Political Sithram: Yellow Army In Pink Party

Political Sithram: Yellow Army In Pink Party

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దగ్గర్నుంచి ఆ పార్టీలో ముఖ్య నేతల లెక్క తీస్తే, అందులో నూటికి 90 శాతం మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినవారే కనిపిస్తారు. రాజకీయాల్లో నేతలు పార్టీలు మారడం సహజమే అయినా, ఓ పార్టీ పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయి, మరో పార్టీ వైపు గంపగుత్తగా నేతలు వెళ్ళడమనేది చాలా అరుదుగా కనిపిస్తుంటుంది.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంతర్ధానమైపోతున్న స్థితిని చూస్తున్నాం. ‘కేసీయార్ అడిగినప్పుడే ఆయన కోరుకున్న పదవి ఇచ్చి వుంటే..’ అంటూ చంద్రబాబు ఇప్పటికీ బాధపడుతుంటారు. నిజమేనేమో.. చంద్రబాబు, కేసీయార్ అడిగినప్పుడే కీలకమైన మంత్రి పదవి ఇచ్చి వుంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి వుండేది కాదేమో.. తెలుగుదేశం పార్టీ ఇంతలా నాశనమయి వుండేది కాదేమో.

‘తెలంగాణ రాష్ట్ర సమితిలో వున్నోళ్ళంతా తెలుగుదేశం పార్టీ నేతలే..’ అంటూ, టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడైన ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంతో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయినా, ఇందులో తప్పేముంది.? టీడీపీకి తెలంగాణలో భవిష్యత్తు లేదని భావించిన నేతలు, తెలంగాణ రాష్ట్ర సమితిలోకి దూకేశారు.

రేవంత్ రెడ్డికి అనుమతి లేదుగానీ, లేకపోతే ఆయనా తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్ళేవారేనేమో. ఇక, తెలంగాణ రాష్ట్ర సమితిలోకి టీడీపీ నుంచి తాజా ఎంట్రీ.. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ. టీడీపీకి గుడ్ బై చెప్పేసిన రమణ, రేపో మాపో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోబోతున్నారు. తదుపరి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడెవరవుతారో.? అసలు, ఆ పార్టీకి తెలంగాణలో నేతలున్నారా.? లేదా.? వున్నా లేకపోయినా.. వెతికి మరీ ఎవరో ఒకరికి చంద్రబాబు బాధ్యతలు అప్పగించడం ఖాయం.. అలా బాధ్యతలు అందుకున్నవారు కొన్నాళ్ళు ఆగి, తెలంగాణ రాష్ట్ర సమితిలోకో, కాంగ్రెస్ పార్టీలోకో లేదంటే బీజేపీలోకో వెళ్ళిపోవడమూ ఖాయమే.