2014 నుంచి 2019 మధ్యలో అమరావతి కేంద్రంగా పెద్దయెత్తున భూ కుంభకోణాలు జరిగినట్లు వైసీపీ ఆరోపించడమే కాదు, అధికారంలోకి వచ్చాక ఆ ఆక్రమణల అంతు తేల్చేందుకు పలు రకాలైన చర్యలు చేపట్టింది. ప్రభుత్వ కట్టడం ప్రజావేదిక కూల్చివేత అప్పట్లో పెను దుమారం రేపింది.
ఆ తర్వాత చంద్రబాబు నివాసానికి సంబంధించి కొంత భాగాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. అంతే, ఆ తర్వాత అమరావతి పరిధిలో కట్టడాల జోలికి వెళ్ళలేదు. అయితే, గత కొద్ది నెలలుగా విశాఖ కేంద్రంగా కూల్చివేతల పర్వం నడుస్తోంది.
మాజీ ఎంపీ సబ్బం హరికి చెందిన భవనంలో కొంత భాగాన్ని అధికారులు కూల్చివేశారు. పార్కు స్థలాన్ని సబ్బం కబ్జా చేశారన్నది అప్పట్లో వినిపించిన ఆరోపణ. గీతం యూనివర్సిటీకి సంబంధించి కూడా కొంత భూమిలో కూల్చివేతలు నడిచాయి. టీడీపీకి చెందిన నేతలే లక్ష్యంగా విశాఖలో కూల్చివేతలు జరుగుతూనే వున్నాయి.
మొన్నామధ్య ఓ ప్రముఖ దినపత్రికకు సంబంధించిన కట్టడాన్ని కూడా అధికారులు కూల్చేశారు. వీటిల్లో చాలా వ్యవహారాలు ఆ తర్వాత కోర్టు మెట్లెక్కాయి. ‘వైఎస్ జగన్ ప్రభుత్వం కుట్రపూరిత చర్యలకు పాల్పడుతోంది..’ అన్నది టీడీపీ ఆరోపణ. ‘ఇందులో కక్ష సాధింపు చర్యలేమీ లేవు.. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైతే, వాటిని కాపాడుతున్నాం..’ అని అంటోంది వైసీపీ. ఏది నిజం.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఇక్కడ విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటోందన్నది నిర్వివాదాంశం.
‘టీడీపీ నుంచి నేతలు వైసీపీలోకి వెళితే.. అలాంటివారిపై చర్యలు వుండడంలేదు.. వారి ఆక్రమణలు ప్రభుత్వానికి కనిపించడంలేదు..’ అంటూ టీడీపీనే ఆరోపిస్తుండడం ద్వారా విశాఖలో కబ్జాలు నిజమేనన్న వాదనను బయటపెట్టేస్తోంది టీడీపీ. అయినాగానీ, కూల్చివేతల విషయంలో ప్రభుత్వం, ఒకింత వివాదాలకు తావు లేకుండా చర్యలు చేపడితే, విశాఖ బ్రాండ్ ఇమేజ్ బలపడుతుంది.
లేదంటే, ‘మీరు కూల్చేశారు కాబట్టి, మేం అధికారంలోకి వచ్చినప్పుడు మేమూ కూల్చేస్తాం..’ అనే స్థాయి ప్రకటనలు ప్రత్యర్థి వర్గం నుంచి రావడం ద్వారా విశాఖ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయిపోవడం ఖాయం.