పొలిటికల్ గాయం: బెంగాల్ దీదీ కాలు ఎందుకు విరిగింది చెప్మా.?

mamata banerjee
mamata banerjee
mamata banerjee

పశ్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్నికల వేళ గాయపడ్డారు. ఆమె నామినేషన్ వేసేందుకు వెళ్ళగా, అక్కడ జరిగిన తొక్కిసలాట, గలాటాలో కిందపడిపోయారట. ఈ క్రమంలో ఆమె కాలికి గాయమయ్యిందట. ఆ గాయం తీవ్రత కూడా ఎక్కువేనని వైద్యులు తేల్చారు. ఏకంగా రెండు నెలలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారంటూ ప్రచారం జరుగుతోంది. కాగా, తన మీద బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని అంటున్నారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అత్యంత కట్టుదిట్టమైన భద్రత వుండే ముఖ్యమంత్రి మీద ఎవరైనా దాడి చేయగలరా.? అన్నది బీజేపీ ప్రశ్న. బీజేపీ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అనుమానాన్ని తెరపైకి తెస్తోంది. కాగా, ఇదంతా ఎన్నికల వ్యూహాలను రచించే వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్కెచ్.. అనే వాదనా లేకపోలేదు. గతంలో ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్, అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మీద కూడా ‘దాడి’ వ్యూహం రచించారన్నది అప్పుడూ, ఇప్పుడూ వినిపిస్తోన్న ఆరోపణ.

ఆ మాటకొస్తే, ఆంధ్రపదేశ్‌లో కూడా ప్రశాంత్ కిషోర్ ఇలాంటి రాజకీయ వ్యూహాన్నే వైసీపీ అధినేత వైఎస్ జగన్ విషయంలో ‘కోడి కత్తి’ ఎపిసోడ్ ద్వారా నడిపించారని కొందరు అంటుంటారు. మిగతా సంగతులెలా వున్నా, మమతా బెనర్జీ విషయంలో పరిస్థితి కొంత ఆందోళనకరమేనని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. పశ్చిమబెంగాల్‌కి సంబంధించినంతవరకు మమతా బెనర్జీ స్టార్ క్యాంపెయినర్. తృణమూల్ పార్టీకి ఆమె తప్ప, ఆ స్థాయిలో పార్టీకి ప్రచారం పరంగా గ్లామర్ తేగలిగే ఇంకో నాయకుడు లేదా నాయకురాలు లేరు. అలాంటప్పుడు, ప్రశాంత్ కిషోర్ ఎంతలా సలహాలిచ్చినా, ‘గాయం’ డ్రామాకి ఆమె ఒప్పుకునే అవకాశాలుండవు. రెండు నెలలు గాయం కారణంగా ఇంటికే పరిమితమవ్వాల్సి వస్తే, బెంగాల్‌లో మమత పార్టీ కాలగర్భంలో కలిసిపోవచ్చు. సో, ఏదో జరిగింది. అదేంటన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్.