ప్రధాని నరేంద్ర మోడీకి మాతృ వియోగం సంభవించింది. మోడీ తల్లి హీరాబెన్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి, ఈ రోజు తెల్లవారుఝామున తుది శ్వాస విడిచారు. ఆమె పార్దీవ దేహానికి అంత్యక్రియలు కూడా పూర్తయిపోయాయి.
ప్రధాని మోడీ విషణ్ణ వదనంతో తన తల్లి అంత్యక్రియల్ని పూర్తి చేశారు. ప్రధాని మోడీకి దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సంతాప సందేశాలు వెళుతున్నాయి. ‘ధైర్యంగా వుండండి..’ అంటూ ప్రముఖులు మోడీకి పేర్కొంటున్నారు. తల్లితో మోడీకి వున్న అనుబంధం గురించి కొత్తగా చెప్పేదేముంది.?
ఓ వైపు మాతృమూర్తి అంత్యక్రియలు.. ఇంకో వైపు పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించడం.. వెరసి, మోడీ పేరు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి గురవుతోంది.
పశ్చిమబెంగాల్‌లో తొలి హై స్పీడ్ రైల్ (వందే భారత్ ఎక్స్‌ప్రెస్)కి ప్రధాని మోడీ జెండా ఊపారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘మీ తల్లి అంటే మా అందరికీ కూడా తల్లి లాంటి వారే.. మీరు ధైర్యంగా వుండండి.. రెస్ట్ తీసుకోండి’ అని వ్యాఖ్యానించారు. కాగా, మోడీ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారనీ, వర్చువల్ కార్యక్రమాలు గనుక.. మోడీ హాజరవ్వాల్సిన పనేమీ లేదనీ, అయినాగానీ పబ్లిసిటీ స్టంట్లలో భాగంగా ఆయన ప్రత్యేక పరిస్థితుల్లోనూ హంగామా చేశారనే రీతిలో ట్రోలింగ్ జరుగుతోంది.
ఇక్కడ ఆయన కార్య సిద్ధిని చూడాలే తప్ప, పబ్లిసిటీ స్టంట్ల కోణంలో చూడకూడదన్నది బీజేపీ మీద్దతుదారుల వాదన.