ఇది కరోనా కాలం. ఇదివరకులా ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్లు వినాయకుడిని బహిరంగ ప్రదేశాల్లో పెట్టే వీలు లేదు. పర్మిషన్ కూడా లేదు. ఎక్కడికక్కడ పోలీసుల మొహరించి రూల్స్ బ్రేక్ కాకుండా వినాయకుడి ఉత్సవాలు జరుపుకునేలా చూస్తున్నారు.
ఇప్పటికే దేశం కరోనాతో అల్లకల్లోలం అవుతోంది. మరోవైపు వినాయకుడి ఉత్సవాలు అంటేనే మూకుమ్మడిగా చేసేది. దీంతో కరోనా ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని… ఈసారి ఎవరి ఇంట్లో వాళ్లే వినాయకుడిని ప్రతిష్టించుకోవాలని ప్రభుత్వాలు ఆదేశించాయి.
అందులోనూ ఎత్తు ఉన్న విగ్రహాలను కూడా ఈసారి పెట్టడానికి వీలు లేదు. కానీ.. నిబంధనలకు విరుద్ధంగా కొందరు యువకులు ఐదు ఫీట్ల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని నిర్వాహకులతో పాటుగా వినాయకుడి విగ్రహాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ ఘటన గుజరాత్ లోని సూరత్ లో చోటు చేసుకున్నది. ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ప్రతిష్టించవద్దు.. అని అక్కడి పోలీసులు ముందే హెచ్చరించారట. అయినా కూడా కొందరు యువకులు పోలీసుల మాటలు పెడచెవిన పెట్టారు. దీంతో పోలీసులు ఈ పని చేయాల్సి వచ్చింది.
ఇక.. ఆ వినాయక విగ్రహాన్ని ఉమ్రా పోలీస్ స్టేషన్ ముందు పెట్టడంతో అటు వెళ్లే వాళ్లంతా ఆశ్చర్యంగా దానివైపు చూసి ఆ విగ్రహాన్ని క్లిక్ మనిపించి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ ఫోటోలు కాస్త నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.