Crime News: చాలామంది ఇది మాదకద్రవ్యాలు డబ్బు బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడుతూ ఉంటారు. తాజాగా ఇటువంటి సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా పంచలింగాల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఈ బండారం బయటపడింది.హైదరాబాద్ నుంచి కోయం బత్తూరు వెళ్తున్న NL01 B 1149 నెంబరు గల స్వామి అయ్యప్ప ప్రైవేటు ట్రావెల్ బస్సును పంచాలింగాల అంతరాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసులు తనిఖీ చేయగా రూ 5 కోట్లు విలువచేసే బంగారం, వెండి బిస్కెట్లు, 90 లక్షల రూపాయల డబ్బు అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు చిక్కారు. అధిక మొత్తంలో డబ్బు, బంగారం చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద SEB పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న తరుణంలో అయ్యప్ప ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఆపి అందులో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో బస్సులో ఉన్న ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని తనిఖీ చేయగా డబ్బు,బంగారు నగలు, బంగారు,వెండి బిస్కెట్లు బయటపడ్డాయి.బంగారాన్ని అక్రమ రవాణ కు పాల్పడిన వ్యక్తులు తమిళనాడు, సేలం పట్టణానికి చెందిన దేవరాజు, సెల్వ రాజు, కుమార వేలు, మేయలాగ మురుగేశన్, కొయంబత్తురుకు చెందిన వెంకటేశ్‌లుగా గుర్తించారు.
నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని డబ్బు బంగారాన్ని సీజ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసులు నిందితులను విచారించగా..హైదరాబాద్ లోని బంగారు దుకాణాల నుండి బంగారు వెండి ముడిసరుకులు సేకరించి తమిళనాడు తీసుకు వెళ్లి ఆభరణాలు తయారుచేసి తిరిగి వాటిని హైదరాబాద్లోని బంగారు దుకాణాలలో విక్రయిస్తామని చెప్పుకొచ్చారు. అయితే వారి వద్ద లభ్యమైన బంగారు, డబ్బు కి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్ లేకపోవడంతో పోలీసులు వాటిని సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.