బంగారం కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా? అయితే ఇది మీకు తప్పక తెలుసుకోవాల్సిన సమాచారం. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు సోమవారం మళ్లీ కిందకి జారాయి. దీంతో మూడు వారాల కనిష్ట స్థాయికి చేరుకున్న బంగారం 10 గ్రాములకు రూ.1,21,284 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది గత సెషన్‌తో పోల్చితే రూ. 224 తగ్గింది. అక్టోబర్ 17న ఈ బంగారం ధర రూ.1,32,294 గరిష్ట స్థాయిని తాకినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.11,000 మేర తగ్గింది. అయితే, వెండి మాత్రం బలపడుతూ కిలోకు రూ.1,49,374 వద్ద రూ.1,087 లాభంతో ట్రేడ్ మొదలుపెట్టింది.
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు బలహీనంగా కనిపిస్తున్నాయి. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెట్టుబడిదారుల్లో వడ్డీ రేట్ల కోతలపై ఆశలను తగ్గించాయి. దీంతో డాలర్ బలపడగా, బంగారం పెట్టుబడులు కాస్త వెనుకంజ వేశాయి. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడంతో కూడా విలువైన లోహాల మీద కొనుగోలు ఆసక్తి తగ్గింది. గత వారం బంగారం, వెండి రెండూ గణనీయమైన అస్థిరతను చూపించాయి. డాలర్ ఇండెక్స్ మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం, యూఎస్ 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్స్ 4 శాతాన్ని దాటడంతో safe-haven buying తగ్గింది. దీని ఫలితంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
ఇక భౌతిక మార్కెట్లలో కూడా ధరలు నగరానికో భిన్నంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 8 గ్రాములకు రూ. 91,808 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ.98,736 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.90,296, 24 క్యారెట్ల ధర రూ.97,096. హైదరాబాద్, చెన్నై మార్కెట్లలో కూడా దాదాపు ఇదే స్థాయిల్లో ట్రేడ్ జరుగుతోంది. నిపుణుల ప్రకారం బంగారం ప్రస్తుతం తాత్కాలికంగా తగ్గినా, దీర్ఘకాలంలో ఇది మళ్లీ పెరుగుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అనిశ్చితి, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, మరియు డాలర్ బలహీనత వచ్చే నెలల్లో బంగారం ధరలను మళ్లీ ఎగసేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, దీర్ఘకాల పెట్టుబడిదారుల కోసం ఇది ఒక “గోల్డెన్ అవకాశం” కావచ్చు.
