ప్రస్తుతం బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లక్షన్నర రూపాయల దరిదాపుల్లోకి చేరిన పసిడి ధరలు సామాన్యుడి కలను మరింత దూరం చేశాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఒక్కసారిగా మారింది. గత వారం రోజులుగా బంగారం ధరలు గణనీయంగా తగ్గడంతో గోల్డ్ కొనాలనుకునే వారికి అరుదైన అవకాశం దక్కింది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు, పెట్టుబడిదారుల ప్రాఫిట్ బుకింగ్ కారణంగా బంగారం ధరలు నేల చూపులు చూశాయి. గ్లోబల్ మార్కెట్‌లో తగ్గుదల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పైనా స్పష్టంగా కనిపించింది. ఫలితంగా కేవలం వారం రోజుల్లోనే బంగారం ధర ఏకంగా వేల రూపాయల మేర తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ తగ్గుదల మరింత ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ మార్కెట్‌ను పరిశీలిస్తే డిసెంబర్ చివరిలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,000కు పైగా ఉండగా, జనవరి మొదటి వారానికి వచ్చేసరికి అది రూ.1,35,000 స్థాయికి దిగివచ్చింది. అంటే ఒక్క వారం వ్యవధిలోనే సుమారు రూ.6,600 మేర తగ్గినట్టైంది.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా కుప్పకూలాయి. కిలో వెండి ధర డిసెంబర్ చివరిలో రూ.2.85 లక్షల వద్ద ఉండగా, ప్రస్తుతం రూ.2.57 లక్షల స్థాయికి పడిపోయింది. అంటే వెండి ధర దాదాపు రూ.28 వేల మేర తగ్గింది. ఈ స్థాయి తగ్గుదల చాలా అరుదుగా కనిపిస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం గోల్డ్ కొనాలనుకునే వారికి ఇది అనుకూల సమయంగా మారింది. తగ్గినప్పుడు కొనుగోలు చేస్తే మంచి లాభం ఉంటుందన్న అభిప్రాయం మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
అయితే ఈ ధరలకు జీఎస్‌టీతో పాటు ఆభరణాల తయారీ చార్జీలు అదనంగా ఉంటాయన్న విషయాన్ని కొనుగోలుదారులు గుర్తుంచుకోవాలి. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం వచ్చే వారం నుంచి బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే కొనాలనుకుంటే ఆలస్యం చేయకుండా ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే మేలు జరుగుతుందన్న సూచనలు వినిపిస్తున్నాయి.
