ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మళ్ళీ పోలవరం రగడ.!

Polavaram

పోలవరం ప్రాజెక్టు వల్లనే భద్రాచలం ముంపుకు గురయ్యిందంటూ తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ సంచలన ఆరోపణలు చేయడంతో, ఆంధ్రప్రదేశ్ మంత్రులు అందుకు ధీటుగా బదులిస్తున్నారు. కనీ వినీ ఎరుగని రీతిలో గోదావరి నదికి వరద రావడం వల్లే ముంపు చోటు చేసుకుందనీ, తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు ప్రాంతాలు నీట మునిగాయన్నది ఆంధ్రప్రదేశ్ మంత్రుల వాదన.

పోలవరం ప్రాజెక్టు కోసమంటూ ఖమ్మం జిల్లాలోని కొంత భాగాన్ని ఆంధ్రప్రదేశ్‌కి బదలాయించారనీ, అందులో కొంత ప్రాంతాన్ని తిరిగి తెలంగాణకు ఇచ్చేయాలని పువ్వాడ అజయ్ డిమాండ్ చేయగా, అలాంటి అవకాశమే వుండదంటూ ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు తెగేసి చెబుతున్నారు.

పోలవరం కొత్త ప్రాజెక్టు కాదనీ, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమయ్యిందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఎత్తు తగ్గించడం జరగని పని అన్నది బొత్స వాదన.

కాగా, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు విషయమై తనకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లు గతంలో అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ప్రకటించిన విషయం విదితమే. అసలంటూ ఇంకా ప్రాజెక్టు పూర్తవకుండానే, ప్రాజెక్టులో నీటి నిల్వ చేయకుండానే.. ప్రాజెక్టు వల్ల ముంపు.. అంటూ తెలంగాణ వితండవాదానికి దిగడం ఆశ్చర్యకరమే.

ఇదేదో స్క్రిప్టెడ్ డ్రామాలా వుంది తప్ప.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అధికార పార్టీలకు చిత్తశుద్ధి లేదన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.