ప్రధాని మోడీ దేశానికీ చెయ్యబోయే గొప్ప మేలు….

PM Modi 70th Birthday

ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తన 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పార్టీలకతీతంగా ప్రధాని మోడీ కి కొందరు ప్రత్యక్షంగా మరికొందరు సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నరేంద్ర మోడీ అంటే గుర్తుకు వచ్చేది అత్యంత పేదరికం నుండి వచ్చిన ఒక ఒక యువకుడు తన చిన్నతనంలో టీ కొట్టులో పనిచేసిన వ్యక్తి ప్రపంచంలో కెల్లా అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అత్యున్నత పదవి అయిన ప్రధానమంత్రి గా ఎన్నిక కావడమే. టి అమ్మే స్థాయినుండి ఒక ప్రధానమంత్రి గా ఎదగాలంటే దాని వెనక ఎంతో కఠోరమైన శ్రమ, క్రమశిక్షణ, ఓర్పు, తెలివితేటలు, రాజకీయ వ్యూహం అన్ని కలిసి ఉంటే తప్ప అది సాధ్యపడదు. కొంచెం ఎక్కువ తక్కువలో ఈ గుణాలన్నీ నరేంద్ర మోడీ లో మనకు తప్పకుండా కనిపిస్తాయి.

PM Modi 70th Birthday

ఇంకో విశేషమైన అంశం ఏంటంటే నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ స్వతహాగా అగ్రకులాలు హవా బాగా ఎక్కువగా వున్నా పార్టీ. గతంలో బీజేపీ అగ్రనాయకత్వంలో చాలా వరకు కేవలం బ్రాహ్మణులు ఉండేవారు. అటువంటి పార్టీలో ఒక వెనుకబడిన తరగతులు నుండి వచ్చిన నరేంద్ర మోడీ ఒక సామాన్య ఆర్ఎస్ఎస్ ప్రచారక్ స్థాయి నుండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఎదగడం, మూడు దఫాలు ముఖ్యమంత్రిగా గెలవడం, ఆపైన ఆ పార్టీ నాయకత్వం నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం ఒక విశేషం. అంతకుముందు ఎప్పుడూ భారతదేశంలో ఎవరు చూడనటువంటి ఒక వినూత్నమైన పద్దతిలో ప్రచారం నిర్వహించి ఇది అధ్యక్ష తరహా ఎన్నికల అన్నంతగా ప్రజల్ని ప్రభావితం చేసి పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకు రాగలిగారు. ప్రచారంలో ఎన్నో జిమ్మిక్కులు ఎంతో నెగిటివ్ క్యాంపెయిన్ చేసి ఉండొచ్చు అయితే అన్ని పార్టీల నాయకులు అదే చేసారు కాబట్టి చివరకు గెలిచామా లేదా అన్నదే ముఖ్యం.

భారత ప్రజానీకం నరేంద్ర మోడీ మీద ఎన్నో ఆశలతో అధికారం కట్టబెట్టింది. ఒక ప్రధానిగా ఈ దేశ ప్రతిష్టను కచ్చితంగా నరేంద్ర మోడీ ఒక మెట్టు పెంచారని చెప్పాలి. భారత దేశానికీ మునుపటి కంటే ఒక ప్రత్యేక గుర్తింపు నరేంద్రమోడీ నాయకత్వంలో లభించింది. చాలా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగయ్యాయి. పెట్టుబడులకు ఒక అనుకూలమైన దేశం అని కూడా సంకేతాలు పంపించగలిగారు. అందుకు కారణం నరేంద్ర మోడీ నేతృత్వంలో స్థిరమైన ప్రభుత్వం అలాగే భారత్లో లభించే ఇంజనీరింగ్ ప్రతిభ కూడా ఒక కారణం. కారణం ఏదైనప్పటికీ అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి విదేశీ కంపెనీలు తమ హెడ్ క్వార్టర్స్ మరియు మెయిన్ క్యాంపస్లకు భారత్ ని తమ గమ్యంగా ఎంచుకోవడం ప్రారంభించాయి. తప్పకుండా ఈ క్రెడిట్ చాలా వరకు ప్రధాని నరేంద్ర మోడీకి చెందుతుంది. ఈ కంపెనీలన్నీ కేవలం నరేంద్ర మోడీని చూసి వచ్చాయా లేకపోతే వచ్చేవి కాదా అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే భారతదేశం ప్రపంచలోకెల్లా ఐటీ సేవలు అందించడంలో ఐటీ ఉద్యోగస్తులు ని అందించడంలో మొదటిస్థానంలో నిలబడుతుంది. మోడీ నాయకత్వం మీద భరోసాతో ముందునుంచి వున్న వారి కార్యకలాపాలను మరింత పెద్దగా ఐటి సంస్థలు విస్తరించాయి అని అనుకోవడంలో తప్పేమీ లేదు

PM Modi

ఇక సామాన్య ప్రజానీకం విషయానికొస్తే మోడీ పరిపాలన వలన వారి జీవితాలు పెద్దగా మెరుగుపడింది ఏమీ లేదు. మెరుగు పడకపోగా అనేక విషయాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి ఉదాహరణకి జీఎస్టీ అయితేనేమి లేకపోతే నోట్ల రద్దు అయితేనేమి, CAA , NCR లాంటి వివాదాస్పద అంశాలు కొంత అసౌకర్యం కలిగించిన మాట వాస్తవం. వ్యవసాయంలో గాని, విద్య వైద్యం లో గాని ఈ ఆరేళ్ళ కాలంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ రాలేదు. అందుకే అంటుంటారు భారత ప్రధాని విదేశాల్లో ఉన్న భారతీయులకు ఒక గొప్ప ప్రధానిగా కనిపిస్తారు కాకపోతే భారతదేశంలో నివసిస్తున్న పేదలకు మాత్రమే వారి జీవితాల్లో వెలుగులు నింపలేని ప్రధానిగా నిలిచారని.

ఇక రాజకీయంగా చూస్తే ఖచ్చితంగా ఒక పదేళ్లపాటు స్థిరమైన ప్రభుత్వాన్ని ప్రజలకు అందించిన ఘనత తప్పకుండా మోదీకి చెందుతుంది. మొదటిసారి కంటే రెండోసారి ప్రజలు మరింత మెజారిటీ అప్పగించి ఈ దేశ పరిపాలన వ్యవహారాలను ప్రధాని మోడీ చేతిలో పెట్టారు. అయితే ప్రధాని విమర్శకులు మాత్రం ఇది మోడీ గొప్పతనం కాదు కేవలం బలమైన ప్రతిపక్షం లేనందువల్లనే మోదీకి ఇంత పెద్ద విజయం సాధించడం సాధ్యమైందని అని చెబుతుంటారు.

ప్రజలు ఇచ్చిన మెజారిటీ ప్రజల కోసం ఎలా వినియోగించాలి అని మాత్రమే ప్రధాని మోదీ ఆలోచిస్తే బిజెపి మరో పదేళ్ల పాటు ఈ దేశంలో అధికారంలో కొనసాగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేవలం రాజకీయ ప్రత్యర్థులను, బీజేపీ విధానాలను వ్యతిరేకించిన వారిని అప్రజాస్వామికంగా అణచివేయడానికి మాత్రమే వాడితే అది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఇస్తుంది.

చివరగా ఒక మాట ఏంటంటే ఈ దేశంలో అత్యంత పేదరికం నుండి అత్యంత ఉన్నత స్థాయికి నరేంద్ర మోడీ ఎదిగారంటే అది కేవలం ఈ దేశ ప్రజస్వామ్యం యొక్క గొప్పతనం దానిని అప్పటివరకు కాపాడిన నాయకుల గొప్పతనం. ప్రజాస్వామమే లేకుంటే అయన  శ్రమ, పట్టుదల ఆయన్ని రాజకీయంగా ఎక్కడికి తీసుకువెళ్లేవి కాదు. ఈ ప్రజాస్వామ్య విలువలని కాపాడి వచ్చే తరానికి అందించడమే ఈ దేశానికీ మోడీ చెయ్యబోయే గొప్ప మేలు అని గుర్తు పెట్టుకోవాలి.

పుట్టినరోజు సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలుగు రాజ్యం తరఫున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు!!