మోదీ జగన్‌కు క్లాస్ పీకారు, మోదీ మాటలకు జగన్ డిసప్పాయింట్ అయ్యారు అంటూ ఒక వర్గం మీడియాలో జగన్ ఢిల్లీ టూర్ గురించి వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలు పట్టుకుని తెలుగు తమ్ముళ్లు వైసీపీ మీద జగన్ మీద సెటైర్లు వేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఢిల్లీ లెవల్లో సీన్ వేరే ఉంది. మోదీగారేమీ అమిత్ షా ద్వారా జగన్‌కు వార్నింగులు, హెచ్చరికలు ఇప్పించలేదు. తిరుమల డిక్లరేషన్ విషయంలో కూడ బీజేపీ హైకమాండ్ కోపంగా ఉందని, హిందూత్వం విషయం కాబట్టి మోదీ నొచ్చుకున్నారని అన్నారు. కానీ అలాంటి వాతావరణమే లేదక్కడ. పైపెచ్చు మోదీ జగన్‌ను మెచ్చుకున్నారట.
జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో తిరునామాలు, పంచెకట్టుతో హిందూత్వం ఉట్టిపడేలా కనిపించారు. ఆ ఫొటోలు మీడియాలో బాగా సర్క్యులేట్ అయ్యాయి. వీటితోనే తాను పూర్తి హిందూత్వవాదినని, శ్రీవారి మీద అపారమైన భక్తిశ్రద్దలు ఉన్నాయని జగన్ హింట్ ఇచ్చేశారు. అక్కడే ప్రత్యర్థుల విమర్శలకు సగం చెక్ పడినట్టైంది. కొవిడ్ నివారణ చర్యల మీద చర్చలో భాగంగా వైఎస్ జగన్ తిరుమల నుండే ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఆ సమయంలో ప్రధాని తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చి కూడా మీరు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం అభినందనీయమని, అలాగే జగన్ వెనకున్న శ్రీవారి ఫోటో చూసి మీతో మాట్లాడుతుంటే శ్రీవారి దర్శనం చేసుకున్నట్టే ఉందని అన్నారు.
అంతేకాకుండా జగన్ ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను గురించి కూడ మెచ్చుకోలుగా మాట్లాడారు. టీడీపీ చెబుతున్నట్టు జగన్ అంటే బీజేపీకి కోపమే ఉంటే మోదీ ఇంత సౌమ్యంగా, మెచ్చుకోలుగా మట్లాడేవారు కాదు. ఏదో విషయం మాట్లాడి మీటింగ్ ముగించేవారు. సో…దీన్నిబట్టి బీజేపీ, వైసీపీల మధ్యన మంచి స్నేహ బంధం ఉందని, మోదీకి జగన్ అంటే సదాభిప్రాయం ఉందని స్పష్టమవుతోంది. బీజేపీ నుండి ఏదో ఆశించిన బాబుకు ఇది గుండెపోటు లాంటి వార్తే. కానీ ఇదే వాస్తవం కదా. కనుక ఇకనైనా తెలుగు తమ్ముళ్లు, ఎల్లో మీడియా ఈ అసత్య ప్రచారాన్ని వీడి వాస్తవాలకు అనుగుణంగా వ్యవహరిస్తే మంచిది. లేకుంటే ప్రజలనే కాకుండా వాళ్లను వాళ్లే మోసం చేసుకున్నట్టు అవుతుంది.