వ్యాక్సినేషన్ వేగవంతం: మోడీజీ చెప్పడం తేలికే, చెయ్యడమే కష్టం.!

PM Modi Has To Know This First

PM Modi Has To Know This First

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏమంత సజావుగా సాగడంలేదు. చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత వుంది. అందుకే, వ్యాక్సిన్ కోసం ప్రజలు వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద బారులు తీరాల్సి వస్తోంది.. వ్యాక్సిన్ అందకు ఉస్సూరుమనాల్సి వస్తోంది. 130 కోట్ల మంది జనం వున్న భారతదేశంలో.. అందరికీ వ్యాక్సిన్ అందించాలంటే ఏకంగా 230 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరం. ప్రస్తుతానికైతే 18 ఏళ్ళ పైబడిన వారికే వ్యాక్సిన్ వేయడానికి అనుమతి వుంది గనుక.. అలా చూసినా వంద కోట్ల పైనే వ్యాక్సిన్ డోసులు అవసరమవుతాయి.

కానీ, ఆ స్థాయిలో వ్యాక్సిన్ తయారీ సంస్థలు, వ్యాక్సిన్లను ప్రొడ్యూస్ చెయ్యలేకపోతున్నాయి. ఇక, మే 1 నుంచి 18 ఏళ్ళు పైబడి 45 ఏళ్ళ లోపు వారికి కరోనా వ్యాక్సిన్ కోసం కేంద్రం అనుమతులిచ్చింది ప్రత్యేకంగా. అనుమతులైతే ఇచ్చారుగానీ, వ్యాక్సిన్ మాత్రం అవసరమైన మేర దేశంలో అందుబాటులో లేదు. దాంతో, చాలా రాష్ట్రాల్లో కేవలం 45 ఏళ్ళు పైబడినవారికే వ్యాక్సిన్ వేస్తున్నారు. చాలా కొద్ది చోట్ల మాత్రమే 18 నుంచి 45 ఏళ్ళ మధ్యవారికి వ్యాక్సినేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఈ పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తున్నా, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అదెలా సాధ్యం.? ఆంధ్రపదేశ్ విషయానికొస్తే, 10 లక్షల వ్యాక్సిన్లను ఒకే రోజు వేయగల సత్తా వుందంటోంది అక్కడి ప్రభుత్వం. మరి, కేంద్రం కేవలం ఆంధ్రపదేశ్ రాష్ట్రానికే ఒక్క రోజులో అన్ని వ్యాక్సిన్లను పంపగలదా.? పంపాలనుకున్నా ఆ స్థాయిలో వ్యాక్సిన్ తయారవుతుందా.? విదేశాల నుంచి వ్యాక్సిన్లను పెద్ద సంఖ్యలో దిగుమతి చేసుకుంటే తప్ప, వ్యాక్సినేషన్ అందరికీ సాధ్యమయ్యే పరిస్థితి ఇప్పట్లో లేదు. మాటలు చాలించి, చేతలు మొదలు పెడితే, ఎక్కువమందిని కరోనా బారి నుంచి కాపాడుకోవడానికి అవకాశమేర్పడుతుంది.