ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇతోదికంగా సాయం చేయాల్సి వుంది. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక సాయం.. ఇలా పేరేదైతేనేం, రాష్ట్రానికి దక్కాల్సిందేదీ దక్కలేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ రాష్ట్రానికి ఇబ్బదులున్నాయి. రాష్ట్ర ఆర్థిక లోటు విషయమై కేంద్రం తగిన సాయం చేయలేకపోతోంది. అయినాగానీ, సంక్షేమం విషయమై అస్సలు వెనక్కి తగ్గడంలేదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
సంక్షేమం పేరుతో అప్పులు చేసుకుంటూ పోతే, రాష్ట్రాభివృద్ధి ఎలా.? సాధ్యమయ్యే అవకాశమే లేదు. ఇంకోపక్క, ప్రతిష్టాత్మకంగా లక్షల సంఖ్యలో పేదలకు ఇళ్ళ నిర్మాణం షురూ చేసింది జగన్ ప్రభుత్వం. కానీ, దీనికి ఇప్పుడు కేంద్రం సాయం అవసరమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రధాని మోడీకి లేఖ రాశారు కూడా.
మౌళిక సదుపాయాల కల్పన కోసం 30 వేల కోట్లకు పైగా అవసరమవుతుందనీ, ఆ భారాన్ని రాష్ట్రం మోయలేదనీ, పీఎంఏవై పథకం కింద ఆదుకోవాలనీ లేఖలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘స్టిక్కర్ సీఎం.. కేంద్ర ప్రభుత్వ పథకాలకు తన పేరు పెట్టుకుంటున్న జగన్..’ అంటూ ఏపీ బీజేపీ ప్రతి విషయంలోనూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న విషయం విదితమే. నిజానికి, రాష్ట్రం.. కేంద్రాన్ని సాయం కోరడం తప్పేమీ కాదు.
రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నులు వెళుతున్నాయి. కానీ, అంతా మేమే ఉద్ధరించేస్తున్నామన్న భావన కేంద్రంలో అధికారంలో వున్నవారికి వుండడం సహజమే. దాంతో, జగన్ లేఖ తర్వాత బీజేపీ నేతల్లో వింత ప్రవర్తన కనిపించడం కూడా మామూలే. ఇళ్ళు ఇచ్చేంది కేంద్రం.. రంగులేసుకునేది వైసీపీ.. అని అప్పుడే బీజేపీ నేతలు విమర్శలు షురూ చేశారు. చిత్రమేంటంటే, కేంద్రం చేయాల్సిన సాయంలో చేయడంలేదు.. చేయదు కూడా. అయినా, ఈ అవమానాలు రాష్ట్రానికి తప్పడంలేదు.