తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. దుబ్బాక ఫలితం తర్వాత బీజేపీ తన దూకుడు రాజకీయాలను మరింత పెంచింది. బీజేపీలోని నేతలందరూ తెరాసను సీఎం కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా కేంద్రంహోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఏకంగా తెరాస సర్కార్ ను ఇరుగున పెట్టె విధంగా సంచలనమైన ఆరోపణలు చేశాడు.
దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా తమ ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా ఆయన ఆరోపించారు. ఆన్ లైన్ ద్వారా విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ల ట్యాపింగ్ అంశంపై కేంద్రంలోని హోంశాఖ అధికారులతో తాను చర్చించనున్నట్లు పేర్కొన్నారు.ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటమా? లేదంటే మరింకేమైనా చేయొచ్చా? అన్న విషయాన్ని ఆలోస్తానని చెప్పిన ఆయన మాటలు ఇప్పుడు తెలంగాణలో కొత్త కలకలానికి తెర తీస్తాయని చెబుతున్నారు.
ఈ విషయాన్నీ కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే మాత్రం సీఎం కేసీఆర్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఎప్పటి నుండో కేసీఆర్ మీద కేంద్ర సర్కార్ కూడా గుర్రుగా ఉంటుంది. దేశంలో మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా గట్టి స్వరం వినిపించే నేతల్లో కేసీఆర్ ఒకడు. ఒక వేళా కేసీఆర్ వాయిస్ తగ్గించాలనుకుంటే మాత్రం కేంద్రం ఫోన్ ట్యాపింగ్ విషయాన్నీ సీరియస్ గా తీసుకునే అవకాశం లేకపోలేదు.
గతంలోనే కేసీఆర్ సర్కార్ మీద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, అయన పార్టీలో కీలక నేతల యొక్క ఫోన్స్ ట్యాపింగ్ చేశారని , కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందని అప్పట్లో చంద్రబాబు తీవ్రమైన ఆరోపణలు చేశాడు. అయితే కొందరు పెద్దలు ఇందులో కలగచేసుకొని ఆ కేసు సర్దుమణిగేలా చేశారని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. అదే కోణంలో ఇప్పడు కేసీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావటంతో అవి నిజమే కావచ్చు అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.