పేర్ని నాని ప్రశ్న: తిట్టిందెవరు.? ఏమని తిట్టారు.?

మంత్రి పేర్ని నాని తెలిసి అంటున్నారా.? తెలియక అంటున్నారా.? అసెంబ్లీ సాక్షిగా వైసీపీ శాసన సభ్యులు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడి మీదా, ఆయన కుటుంబ సభ్యుల మీదా వ్యక్తిగత దూషణలకు దిగారు.. ఆ వైనాన్ని ప్రపంచమంతా చూసింది కూడా.

‘బట్టలూడదీసి రోడ్డు మీద నిలబెడతారు..’ అన్న మాట అసెంబ్లీలోనే ఓ మంత్రిగారి నోట వినిపించింది. అది రికార్డుల్లోకి వెళ్ళకుండా వుంటుందా.? చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి మంత్రిగారు చెప్పిన మాట ఇది. ఇంకొకాయన లోకేష్ జన్మించడం గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ ఫుటేజీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూనే వుంది.

‘ఎవరన్నారు.? ఏమన్నారు.? మా పార్టీ నుంచి అయితే ఎవరూ చంద్రబాబు కుటుంబ సభ్యుల్ని కించపర్చలేదు. ఆ సంస్కృతి మాది కాదు..’ అంటూ పేర్ని నాని బుకాయిస్తున్నారు. నిజానికి, మీడియాలో సర్క్యులేట్ చేయగల వీడియోలు కావవి. ఓ బూతుల మంత్రి తన బూతు పైత్యాన్ని అసెంబ్లీ సాక్షిగా రుద్దితే, అది ఇంకో మంత్రికి వినిపించకపోవడం, కనిపించకపోవడం శోచనీయమే.

సరే, చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు, వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై ఎలాంటి దూషణలకు దిగారన్నది వేరే చర్చ. అప్పుడు జరిగింది కాబట్టి, ఇప్పుడూ జరుగుతందనే భావనలో అధికార పార్టీ వుండడం తప్పు. చట్ట సభల గౌరవం అయితే దిగజారిపోయింది.

ఈ అంశాన్ని పట్టుకుని చంద్రబాబు పొలిటికల్ పబ్లిసిటీ స్టంట్లు చేయడానికి సంబంధించి ఆయన విజ్ఞత ఏంటన్నది ప్రజలు తేల్చుతారు. కానీ, ఈ విషయమై అధికార పక్షం తమ తప్పుని అంగీకరించి హుందాతనం చాటుకోకపోతే, అదో చారిత్రక తప్పిదమే అవుతుంది.