ఏపీ, తెలంగాణల నడుమ వాటర్ వార్ హోరాహోరీగా జరుగుతోంది. రాయలసీమకు కృష్ణా జలాలు అందించి తీరాలని జగన్ పట్టుబట్టుకుని కూర్చుంటే నీటిని మళ్లిస్టే తెలంగాణ జిల్లాలు కొన్ని అన్యాయమైపోతాయని కేసీఆర్ అడ్డుపడుతున్నారు. ప్రస్తుతం జాతీయ హరిత ట్రిబ్యునల్ ముందు వాదోపవాదనలు జరుగుతున్నాయి. మరోవైపు రాయలసీమ జనం మాత్రం తుది తీర్పు ఎలా ఉంటుందోననే ఆందోళనలో ఉన్నారు. ఎలాగైనా ఎత్తిపోతల పథకం సాకారం కావాలని, అప్పుడే నీటి కష్టాలు తీరుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ మనసు మారి ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇరు పక్షాల వాదనల్లో ఎవరి న్యాయం వారికి ఉంది. ఎవరి వర్గాలు వారిని సపోర్ట్ చేసుకుంటున్నాయి.
తెలంగాణలోని మీడియా సంస్థలు తెలంగాణ ప్రభుత్వం వాదనలను బలపరుస్తూ ఉంటే ఆంధ్రాలోని ప్రముఖ పత్రిక ఈనాడు మాత్రం ఏపీ వాదనలను నీరుగార్చే రీతిలో కథనాలు ప్రచురించింది. ‘నది మొత్తాన్నే మళ్లించే యత్నం’ అంటూ శీర్షిక రాసిన ఈనాడు రోజుకు 80 వేల క్యూసెక్కుల నీటి మళ్లింపు అంటే సుమారు 8 టీఎంసీల నీరు. ఆ మొత్తం నీటితో దేశం మొత్తానికి తాగునీరు సరఫరా చేయొచ్చు అంటూ తెలంగాణ వాదించినట్టు కథనం రాసింది. ఈ పథకానికి పర్యావరణ అనుమతులు ఆవసరం లేదని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక పూర్తిగా అసంబద్దమని టీ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు పెర్కొంది.
అంతేకాదు ‘ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల సామర్థ్యాన్ని భారీగా పెంచింది. మరో వైపు కొత్త ఆయకట్టు లేదని, తాగు నీటి ప్రాజెక్టు అని అంటోంది. వాస్తవానికి అదనంగా పది లక్షల ఎకరాల ఆయకట్టును పెంచి నీరు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కృష్ణా నది జలాలను కృష్ణా బేసిన్ అవసరాలకు వినియోగించాలి. ఇక్కడ మాత్రం పెన్నా బేసిన్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ధర్మాసనం అనుమతిస్తే అక్కడి వాస్తవ పరిస్థితులను హెలికాప్టర్లో తీసుకెళ్లి చూపుతాం’ అంటూ తెలంగాణ తరపు న్యాయవాదులు ధర్మాసనం ముందు వాదనలు వినిపించినట్టు తెలిపారు. ఇలా తెలంగాణ వాదనను పూసగుచ్చినట్టు వివరించిన ఈనాడు ఏపీ వాదనలు ఎలా ఉన్నాయో కనీసం ప్రస్తావం కూడా చేయలేదు.
కనీసం ఎన్జీటీ నిపుణులు ఇచ్చిన పర్యావరణ అనుమతులు అవసరం లేదనే నివేదికను కూడ సమర్థించే ప్రయత్నం చేయలేదు. ఈ శీర్షిక చదివిన ఎవరికైనా తెలంగాణ వాదనలు బలంగా ఉన్నాయని, ఏపీ తరపున ప్రాజెక్టును సమర్థించుకునే సామర్థ్యం కారణాలు లేవనే భావన కలుగక మానదు. అందుకే ముఖ్యంగా సీమ ప్రజల్లో ఈ వార్త తీవ్ర నిరాశను పుట్టుంచేలా ఉంది. ఒకరకంగా ఈ తరహా వార్తలు ప్రభుత్వం మీద ఒత్తిడికి కూడ కారణమవుతాయి. ఈ తరహా ఏకపక్ష వార్తలపై ప్రభుత్వం లీగల్ యాక్షన్ తీసుకోవాలని అంటున్నారు. మరి సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.