TDP and YSRCP : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పెద్ద బాంబు పేల్చారు. చంద్రబాబు హయాంలో పెగాసస్ స్పై వేర్‌ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిందనీ, 25 కోట్ల ప్రతిపాదనలతో తమ వద్దకు కూడా పెగాసస్ సంస్థ ప్రతినిథులు వచ్చారనీ, అయితే దాన్ని తాము తిరస్కరించామనీ అన్నారు మమతా బెనర్జీ.
దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది కొన్నాళ్ళ క్రితం పెగాసస్ అంశం. ఆ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. ఇప్పుడదే రచ్చ తెలుగు నేలకు, అందునా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాకింది పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కారణం.
తన పాత మిత్రుడు చంద్రబాబుపై మమతా బెనర్జీ పెగాసస్ బాంబుని ఎందుకు పేల్చారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో టీడీపీకి మద్దతు కోసం చంద్రబాబు, మమతా బెనర్జీ వెంట తిరిగారు. ఆ తర్వాత మమతా బెనర్జీకి అవసరమైనప్పుడు చంద్రబాబు పట్టించుకోలేదు.
ఇక, చంద్రబాబు హయాంలో పెగాసస్ స్పైవేర్‌ని కొనుగోలు చేయలేదన్నది టీడీపీ వాదన. దీనికి సంబంధించి ఆర్టీయే ద్వారా లభించిన సమాచారాన్ని టీడీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో వుంచుతున్నారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, డీజీపీ పదవిలో వున్నప్పుడు ఇచ్చిన వివరణను జత చేస్తున్నారు టీడీపీ మద్దతుదారులు ఇందుకు సాక్ష్యంగా.
ఇంతకీ, ఏపీలో పెగాసస్ కొనుగోలు జరిగినట్టా జరగనట్టా.? చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ బాసుగా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై ఆరోపణలకు ఈ పెగాసస్ వ్యవహారానికి లింకేంటి.? ఏమో, ఈ రచ్చ ఎక్కడిదాకా వెళుతుందో వేచి చూడాల్సిందే.