పిరికి ఫ్యాక్షనిస్ట్ వైఎస్ జగన్: నారా లోకేష్ అసహనం తారాస్థాయికి.!

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ వర్సెస్ టీడీపీ.. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నమాట వాస్తవం. అధికార పార్టీ అత్యుత్సాహం సుస్పష్టం. మాజీ ముఖ్యమంత్రికి సరైన భద్రత కల్పించలేకపోవడం పోలీసుల వైఫల్యం. ఈ వైఫల్యానికి అధికార పార్టీ నైతిక బాధ్యత వహించాలి. దీన్ని ప్రభుత్వ వైఫల్యంగానే భావించాల్సి వుంటుంది కూడా.!

కానీ, టీడీపీ రెచ్చగొట్టే వ్యాఖ్యల మాటేమిటి.? చంద్రబాబు, వైసీపీ నేతల్నీ, కార్యకర్తల్నీ రెచ్చగొడుతున్నారు.. ఫలితం అనుభవిస్తున్నారు. అయితే, పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేయడాన్ని మాత్రం క్షమార్హం కాదు. ఈ విషయంలో వైసీపీ కార్యకర్తలు మనుషుల్లా ప్రవర్తించడంలేదన్నదీ నిర్వివాదాంశం. పేదలకు తిండి పెట్టే అన్నా క్యాంటీన్లపై దాడి చేస్తే, ధ్వంసాలకు పాల్పడితే.. ప్రజల్లో వైసీపీనే పలచబడిపోతుంది.

సరే, రాజకీయాలన్నాక ఆధిపత్య పోరు సహజం. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలకడమూ సహజమే. చంద్రబాబు హయాంలోనూ పోలీసుల తీరు ఇలాగే వుండేది. అప్పట్లో ‘ఏపీ పోలీసులపై మాకు నమ్మకం లేదు..’ అని పదే పదే అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించేవారు.

ఇదిలా వుంటే, కుప్పంలో జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేయగా, బాధితులపైనే కేసులు నమోదు చేశారంటూ నారా లోకేష్ మండిపడ్డారు. అరెస్టయి జైల్లో వున్న తమ పార్టీకి చెందినవారిని నారా లోకేష్ పరామర్శించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘పిరికి ఫ్యాక్షనిస్టు’గా అభివర్ణించిన నారా లోకేష్, వైసీపీ కార్యకర్తల్ని ‘కుక్కలు’ అంటూ సంబోదించారు.

ఇదిగో ఇలాంటి ‘అతి’ కారణంగానే టీడీపీ నేతలపైనా, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయి. టీడీపీ అధినాయకత్వం అసహనమే, ఆ పార్టీ కార్యకర్తల కొంప ముంచుతోంది.