పవన్ దార్శనికతకు ఇంతకంటే నిదర్శనం కావాలా 

featured
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య అంటే 5వ తరగతి వరకు బోధన మాతృభాషలోనే ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  కొత్త విద్యా విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది మోడీ సర్కార్.  ఈ నిర్ణయం అన్ని రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉన్నా ఒక్క ఏపీ ముఖ్యమంత్రి కి మాత్రం సహించడంలేదు.  ఎందుకంటే వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తొలగించి పూర్తిగా ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని జగన్ భావించారు.  మేధావులు, భాషావేత్తలు ఇది సరైన నిర్ణయం కాదని, మాతృభాషను తొలగించడం విద్యా వ్యవస్థ మీద తీవ్ర నష్టాన్ని చూపుతుందని అన్నారు.  చివరికి హైకోర్టు సైతం మాతృభాషను తొలగించడం రాజ్యాంగ విరుద్దమని అంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కొట్టేసింది.  కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు.  
 
ప్రతిపక్షాల మీద అయితే విపరీతమైన రీతిలో దాడి చేశాయి.  ప్రధానంగా నిర్భంధ ఇంగ్లీష్ విద్యను వ్యతిరేకించిన పవన్ మీద అధికార పక్షం విరుచుకుపడిన తీరు మరీ దారుణం.  పిల్లలకు ప్రాథమిక విద్య అంటే 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన ఉండాలని పవన్ వాదించారు.  ఉనెస్కో, ఆక్స్ ఫర్డ్ పరిశోధనల్లో సైతం మాతృభాషలోనే ప్రాథమిక విద్యా బోధన ఉండాలని, అప్పుడే పిల్లల్లో శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయని సౌమ్యంగానే మాట్లాడారు.  కానీ అధికార పక్షంలో  జగన్ సహా చాలామంది నేతలు పవన్ ముగ్గురు భార్యల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారంటూ వక్ర వాదనను తెర మీదకు తెచ్చారు.  అంతేనా పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివి బాగుడపడటం పవన్ ను ఇష్టం లేదని ఆరోపణలు చేశారు. 
 
ఇక వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ అయితే కనీసం ఇంటర్ కూడా పాస్ కాని పవన్ కళ్యాణ్ కు విద్యా వ్యవస్థ గురించి ఏం తెలుసు అని, డిగ్రీలు లేని పవన్ కు పిల్లల భవిష్యత్తు మీద దార్శనికత ఎలా ఉంటుందని ఎత్తిపొడుపు మాట్లాడారు.  కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం 34 ఏళ్ళ తర్వాత విద్యా విధానంలో మార్పులు చేస్తూ మాతృభాషలో బోధనను 5వ తరగతి వరకు తప్పనిసరి చేసి వీలైతే 8వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన ఉంటే మంచిదని నిర్ణయం తీసుకుంది.  ఈ నిర్ణయం ఎదో ఆషామాషీగా తీసేసుకుంది కాదు.  పంతం కోసం, గొప్పల కోసం తీసుకున్న నిర్ణయం అంతకన్నా కాదు.  ఎన్నో పరిశోధనల ఫలితాలను అధ్యయనం చేసి తీసుకుంది. 
 
ఈ మార్పును అన్ని రాష్ట్రాలు స్వాగతించాయి.  బీజేపీకి బద్ద శతృవుల్లాంటి పార్టీలు సైతం అంగీకరించాయి.  మేధావులు, భాషా శాస్త్రవేత్తలు మెచ్చుకున్నారు.  అలాంటి విధానాన్ని పవన్ ఇంతకుముందే వివరించారు.  మాతృభాషలో బోధన ఎంత అవసరమో బల్లగుద్ది చెబుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు.  ఇది చాలు డిగ్రీలు లేకపోయినా సమాజ శ్రేయస్సు కోసం తపించే పవన్ కు మెరుగైన దార్శనికత ఉందని, అది సమాజహితానికి పనికొస్తుందని చెప్పడానికి.