2024 ఎన్నికలపై జనసేనాని పవన్ కళ్యాణ్ ధీమా ఏంటి.?

”మళ్ళీ ఓడితే నాకేమవుతుంది.? 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా, నేను నాలానే వున్నాను కదా.! నాకేమీ నష్టం లేదు.

నష్టపోయేది ప్రజలే. రాజధాని లేదు, విద్యుత్ లేదు, రోడ్లు సరిగ్గా లేవు.. ప్రజలే ఆలోచించుకోవాలి..” అంటూ మీడియా ప్రతినిథులతో ఇష్టాగోష్టి నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. జనబాహుళ్యంలోనూ ఈ వ్యాఖ్యలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ‘రచ్చబండ వేదికల వద్ద’ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల గురించే జనం చర్చించుకుంటున్నారు.

నిజమే కదా.? పవన్ కళ్యాణ్ ఓడితే ఆయనకేమీ నష్టం లేదు. సరే, వైసీపీ పాలనలో సంక్షేమం అత్యద్భుతంగా అమలవుతోందని వైసీపీ నాయకులు చెబుతున్నదాంట్లో నిజమెంత.? అన్నది వేరే చర్చ. దారుణమైన రోడ్లు, కరెంటు కోతలు, పెరుగుతున్న ధరలు.. ఇవన్నీ జనం అనుభవిస్తున్నవే. అబ్బే, మేం హ్యాపీ..’ అని వైసీపీ పాలన గురించి ప్రజలు అనుకునే పరిస్థితి అయితే లేదు.

గెలవడంపై, ఓడిపోవడంపై పవన్ కళ్యాణ్ పూర్తి స్పష్టతతో వున్నారు. ఫలితం ఏదైనా, పవన్ కళ్యాణ్ మామూలుగానే వుంటారు. మరెందుకు, ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వం..’ అని ఆయన ప్రకటన చేసినట్లు.? అది అధికార వైసీపీని ఇరకాటంలో పడేసేందుకే. తెలుగుదేశం పార్టీని కూడా అయోమయంలో పడేసేందుకే.! పవన్ వ్యూహాలు ఫలించాయి. వైసీపీ గింజుకుంటోంది.. టీడీపీ కూడా ఎటూ తేల్చుకోలేకపోతోంది.

ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీకి ఓ క్లారిటీ వచ్చింది. ‘మా ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణే..’ అని పదే పదే మిత్ర పక్షంతో తమకున్న పొత్తు గురించి ఇంకాస్త గట్టిగా బీజేపీ చెప్పుకోవాల్సి వస్తోంది. ఇదే, ఈ స్పష్టత కోసమే, జనసేనాని ‘వైసీపీ వ్యతిరేక ఓటు’ అంశాన్ని తెరపైకి తెచ్చినట్టుంది.