‘ప్రెసిడెంట్ మెడల్’ వచ్చింది , త్వరలో ‘సీఎం మెడల్’ వస్తుందేమో : పవన్

ఆంధ్రప్రదేశ్ లో ఉండే మద్యం బ్రాండ్ల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు చేశారు. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పింది అని , అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా మధ్య నిషేధం అంటూ సరికొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారని మండిపడ్డారు.

అలాగే మద్యపాన నిషేధం అని చెప్పినవారే మద్యానికి స్పాన్సర్లుగా మారారని విమర్శించారు.

ఇప్పటివరకు మనకు ‘ప్రెసిడెంట్ గ్యాలంట్రీ మెడల్’ (రాష్ట్రపతి అవార్డు) గురించి బాగా తెలుసు అని , కానీ అదే పేరుతో ‘ప్రెసిడెంట్ మెడల్’ అంటూ ఓ మద్యం బ్రాండు తీసుకువచ్చారని విమర్శించారు. ‘సుప్రీం’, ‘బూమ్’, ‘గోల్డెన్ ఆంధ్రా’ పేరిట వైసీపీ ప్రభుత్వమే మద్యం బ్రాండ్లు తీసుకువచ్చిందని ఆరోపణలు చేశారు.

రాష్ట్రంలో మద్యం దొరక్కుండా చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ, తమదైన శైలిలో కొత్త బ్రాండ్లు ప్రవేశపెట్టిందని, ఇవేకాకుండా ఇంకెన్ని బ్రాండ్లు ఉన్నాయో తనకు తెలియదని, భవిష్యత్తులో వైసీపీ పేరుతో ‘వైసీపీ స్పెషల్’, ‘వైసీపీ బ్లూ లేబుల్’, ‘వైసీపీ రెడ్ లేబుల్’ అంటూ మరిన్ని బ్రాండ్లు తెస్తారేమోనని వ్యంగ్యం ప్రదర్శించారు. అలాగే కుదిరితే ‘సీఎం మెడల్’ అంటూ ఇంకో బ్రాండ్ కూడా తీసుకురావొచ్చని వ్యంగ్యాస్త్రాలు కురిపించారు.