పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సినిమాల్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఆయన చేసిన సినిమాల కంటే కూడా ఆయన వ్యక్తిత్వానికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి, ప్రజలకు సేవ చెయ్యాలనే ఉద్దేశంతో జనసేన అనే పార్టీని స్థాపించారు. అయితే ఆయనకు ఉన్న అనుభవ లోపం వల్ల చేసిన తప్పులు వల్ల రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎదగలేకపోతున్నారు. సినిమాల్లో చూపించిన హవా రాజకీయాల్లో చూపించలేక చతికిల పడుతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగలేకపోవడానికి ఆయన పెట్టుకున్న పొత్తులు కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
పొత్తులే పవన్ ముంచాయా!!
సినిమాల్లో అంత క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేస్తే కనీసం ఒక్కచోట గెలవలేకపోయారు. ఎందుకని ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ పెట్టుకున్న పొత్తులే కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చారు, 2019 ఒంటరిగా ఉన్నారు , మళ్ళీ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. నూతన రాజకీయాలు చెయ్యడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఇలా పొత్తులు పెట్టుకుంటూ మళ్ళీ పాచిపోయిన రాజకీయాలే చేస్తున్నారు. ఇలా పొత్తులు పెట్టుకుంటూ రాజకీయంగా తన గుర్తింపును ఏర్పాటు చేసుకోవడంలో విఫలమయ్యారు. అందుకే పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగడం లేదు. 2014లో తన అభిమాన బలాన్ని చంద్రబాబుకి ఇచ్చారు, ఇప్పుడు బీజేపీకి ఇస్తున్నారు. ఇలా బలాన్ని ఇతరులకు ఇస్తున్నారు కానీ తాను మాత్రం వాడుకోవడం లేదు.
ఒంటరి రాజకీయాలు పవన్ చెయ్యలేరా!!
ఒంటరిగా పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ కు ఒంటరిగా రాజకీయాలు చేసే సత్తా ఉంది. కానీ ఎందుకు ఒంటరిగా రాజకీయాలు చెయ్యలేపోతున్నారో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి, మళ్ళీ వెనక్కి తగ్గడంతో పార్టీపై ప్రజల్లో ఉన్న నమ్మకం కాస్త ఇప్పుడు చచ్చిపోయింది. ఇలా పవన్ తనకు తానే నష్టం చేసుకుంటూ రాజకీయంగా బలహీనపడుతున్నారు. బీజేపీతో పొత్తు నుండి బయటకు వచ్చి రాజకీయాలు చేస్తేనే తప్పా పవన్ కళ్యాణ్ రాజకీయంగా బలపడరని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.