చేనేత రాజకీయం.! బాలినేనిని ఇరికించిన జనసేనాని.!

Pawan Kalyan

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘చేనేత రాజకీయం’లో అడ్డంగా ఇరికించే ప్రయత్నం చేశారు. తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సోషల్ మీడియా వేదికగా, ‘చేనేత ఛాలెంజ్’లో భాగంగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ట్యాగ్ చేశారు. ఈ ఛాలెంజ్ ఉద్దేశ్యం, చేనేత దుస్తులు ధరించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా, చేనేతకు ప్రచారం కల్పించడం.

‘రామ్ భాయ్..’ అంటూ కేటీయార్ విసిరిన ఛాలెంజ్ మీద స్పందిస్తూ, తాను చేనేత దుస్తులు ధరించి వున్న ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని ఆ ఛాలెంజ్ కొనసాగింపుగా ట్యాగ్ చేశారు జనసేనాని. వైసీపీ నేతని జనసేన అధినేత ట్యాగ్ చేయడంతో అంతా అవాక్కయ్యారు.

‘వైసీపీలో కొంతమంది మంచి నాయకులున్నారు.. వాళ్ళు ప్రజల గురించి ఆలోచించండి..’ అంటూ వైసీపీని మైండ్ గేమ్‌తో ఇబ్బంది పెట్టేందుకు జనసేనాని ఈ మధ్య తనదైన రాజకీయం చేస్తోన్న విషయం విదితమే. మంత్రి పదవి దక్కకపోవడంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ మీద ఒకింత అసహనంతో వున్నారు. పార్టీకి రాజీనామా చేయాలని గతంలో ఆయన ప్రయత్నించినట్లుగా ప్రచారం కూడా జరిగింది.

ఇక, పవన్ కళ్యాణ్ తనను ట్యాగ్ చేయడంపై స్పందించిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైఎస్సార్ హయాంలో తాను మంత్రిగా పని చేశాననీ, ఆ సమయంలో చేనేత రంగానికి మేలు చేసేందుకు పలు చర్యలు చేపట్టాననీ వివరించారు. అంతే కాదు, వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా చేనేత రంగానికి మేలు చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరిస్తూ ట్వీటేశారు.

మరింత ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందన పట్ల పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో మళ్లీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ‘చేనేత రంగం పట్ల మీకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని అభినందిస్తున్నాను..’ అంటూ పేర్కొన్నారు. ఈ మొత్తం ట్వీట్ల వ్యవహారం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది.

వైఎస్ జగన్‌ని కాదని జనసేన వైపు బాలినేని వెళతారని అనుకోలేం. కానీ, బాలినేని పట్ల వైసీపీ శ్రేణుల్లో ఖచ్చితంగా అనుమానాలు పెరుగుతాయ్.