పవన్ కళ్యాణ్ కు సంకల్పం కావాలి !!

నిస్సందేహంగా పవన్ కళ్యాణ్ ప్రజాకర్షణ ఉన్న నాయకుడు .రాజకీయపార్టీ అధినేతగా రాజకీయాన్ని వృత్తిగా స్వీకరించి స్థిర సిద్దాంతంతో జనంతో ఉండి ఉంటే జనం నమ్మకాన్ని పొందగిలిగేవాడు .

నిలకడలేనితనం ,అవగాహనా రాహిత్యం , తనకు ఏమి కావాలో తెలియనితనం ,తనమీఁద తనకు నమ్మకం లోపించటం కారణంగా ఒడ్డుకు చేరడానికి ఈత కన్నా ఊతాన్నే నమ్ముకోడం మూలంగా టీడీపీతో కొన్నాళ్ళు ,బీజెపీతో కొన్నాళ్ళు అంటకాగడంతో ప్రజా విశ్వాసానికి ఆయన్ను దూరం చేశాయి .

అధికారపార్టీ తప్పులు చేసిన చోట ప్రతిపక్షాన్ని విమర్శించటం , ప్రశ్నించడానికే వచ్చానంటూ చంద్రబాబు తప్పిదాలు నచ్చడం , ప్రజల తరపున పోరాడిన జగన్ ను విమర్శిండం ఆయన తన కోసం కాదు బాబు కోసం పనిచేస్తున్నాడు అన్న భావన మొదలై గడచిన ఎన్నికలలో సొంతంగా పోటీ చేసినా బాబు వ్యతిరేకత ఈయనకు శాపమై తాను కూడా ఓడిపోయాడు .

ఇపుడు తృతీయ ప్రత్యామ్నాయం అవసరముంది . జగన్ మీద వ్యతిరేకత వేస్తే తీవ్రంగా వ్యతిరేకించిన బాబుకే జనం పట్టం కట్టాల్సిన పరిస్థితి .అట్టా కాకుండా పవన్ అంకితభావంతో ఈ రెండేళ్లు జనం సమస్యల పట్ల సొంత వ్యక్తిత్వంతో స్పందిస్తూ తనకూ ఒక అవకాశమిస్తే ప్రజారంజంకంగా పాలిస్తాను అని తన రాజకీయవిదానాన్ని స్పష్టంగా ప్రకటిస్తే ప్రభుత్వం పాలనలో విఫలమయితే ప్రత్యామ్నాయంగా పవన్ వైపు జనం చూసే అవకాశముంటుంది .

వైసిపీ ,టీడీపీ బలంగా ఉన్నాయి కాబట్టి సంఖ్యాపరంగా రెడ్లు కమ్మ సామాజికవర్గం కంటే ఎక్కువగా ఉన్న కాపులు తమ సామాజికవర్గానికి అధికారం ఆశించడంలో తప్పు లేదు . ఈ రెండు పార్టీలను రాష్ట్రమంతా నిలువరించేంత యంత్రంగం ,వనరులు ,గెలుపు సాధించే పరిస్థితులు లేవని పవన్ భావిస్తే రాష్ట్రంలో దాదాపుగా నలభై నియొజకవర్గాల్లో ఇరవై ఆరునుంచి ముప్ఫైశాతానికి పైగా ఓట్లుండి తన సామజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి కేంద్రీకరించి వారి మద్దతు పొందే ప్రయత్నం నిజాయతీగా చేస్తే ముప్పై స్థానాలు గెలిచే ప్రయత్నం చేయవచ్చు . ఒకవేళ సంకీర్ణం అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడితే ముఖ్యమంత్రి కావాలన్న ఆయన ఆకాంక్ష కూడా నెరవేరవచ్చు కర్ణాటకలో కుమారస్వామిలాగా .

రాజకీయాలలో ఏదైనా సాధ్యమే . ఇపుడు పవన్ కు కావాల్సింది సంకల్పం .ఆ సంకల్పాన్ని నెరవేర్చుకునే చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం .